పెద్దనోట్ల రద్దు.. ఆయనది పులి మీద స్వారీయే!
- మరోసారి ప్రధాని మోదీని ప్రశంసించిన సీఎం
పట్నా: పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడుతుండగా.. బీజేపీకి బద్ధవిరోధిగా మారిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్ మాత్రం భిన్నమైన స్వరాన్ని వినిపిస్తున్నారు. పెద్దనోట్ల రద్దును స్వాగతించడమే కాదు ఈ విషయంలో నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తుండటం గమనార్హం. తాజాగా సొంత పార్టీ జేడీయూ నేతల భేటీలో ముచ్చటించిన నితీశ్ మరోసారి మోదీని కొనియాడారు. ‘ప్రధాని మోదీ ఇప్పుడు పులి మీద స్వారీ చేస్తున్నారు. ఇది ఆయన మిత్రులనూ దెబ్బతీసే అవకాశముంది. కానీ ఈ నిర్ణయానికి అనుకూలంగా ప్రజల్లో బలమైన సెంటిమెంట్ ఉంది. దీనిని మనం గౌరవించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
రూ. 500, వెయ్యినోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ఆకస్మిక నిర్ణయం దేశాన్ని విస్మయంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో సామాన్యులు కష్టాలు పడుతుండటంతో ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడుతున్నాయి. కానీ, గతంలో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని తప్పుబడుతూ ఏకంగా ఆ పార్టీతో దోస్తీని తెగదెంపులు చేసుకున్న నితీశ్.. ఇప్పుడు మోదీపై అనూహ్యంగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి గతంలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.