'వివిధ' భారతే.. విజయపతాక! | pm narendra modi memorabla speach at wembly stadium london | Sakshi
Sakshi News home page

'వివిధ' భారతే.. విజయపతాక!

Published Sat, Nov 14 2015 2:27 AM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM

'వివిధ' భారతే.. విజయపతాక! - Sakshi

'వివిధ' భారతే.. విజయపతాక!

- భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత
- వెంబ్లీ స్టేడియంలో ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం
- సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచానికి నేతృత్వం వహించగలం
- ఉగ్రవాదం, భూ తాపోన్నతిపై పోరులో ప్రపంచ దేశాలతో కలిసి నడుస్తాం
- సమానత్వం కోరుకుంటున్నాం.. మెహర్బానీ మాకు అవసరం లేదు
- ప్రవాస భారతీయులే భారత్‌కు నిజమైన రాయబారులు
- భారత్‌లోని యువశక్తి దేశాన్ని అగ్రస్థానంలో నిలపగలదు
- జేమ్స్‌బాండ్.. బ్రూక్‌బాండ్.. ఇప్పుడు రూపీ బాండ్
- డిసెంబర్ 15 నుంచి లండన్- అహ్మదాబాద్ డెరైక్ట్ ఫ్లైట్
 
లండన్:
బ్రిటన్‌లోని అతిపెద్ద ఫుట్‌బాల్ స్టేడియమైన వెంబ్లీ శుక్రవారం త్రివర్ణరంజితమైంది. మోదీ.. మోదీ అంటూ నినాదాలతో ప్రతిధ్వనించింది. మినీ భారత్‌ను తలపిం చింది. లండన్‌లోని ఈ స్టేడియంలో ప్రధాని మోదీ రాక్‌స్టార్ ప్రదర్శన ఇచ్చారు. మరోసారి ‘మేడిసన్ స్వ్కేర్’ను గుర్తుకు తెచ్చారు. గంటకు పైగా మోదీ చేసిన ప్రసంగంలోని ప్రతీ మాటకు హర్షాతిరేకాలతో సభికులు ప్రతిస్పం దించారు. ఉద్వేగం, ఉత్తేజం, స్ఫూర్తిదాయకత, చతురోక్తులతో నిండిన ప్రసంగంతో అందరినీ మైమరింపజేశారు.

భారత్ శక్తిని, భారత్ భవిష్యత్తును, ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ సాధించిన సానుకూలతను, యువ భారత్ సామర్ధ్యాన్ని సభికుల కళ్లకు కట్టి.. భవిష్యత్ భారత్‌పై భరోసా పెంచారు. భారత్ శక్తి వైవిధ్యతేనని, భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకత అని చాటి చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార సాధనలో ప్రపంచ దేశాలకు నేతృత్వం వహించగల శక్తి సామర్ధ్యాలు భారత్‌కు ఉన్నాయని తేల్చి చెప్పారు. లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో మోదీ ఇచ్చిన స్ఫూర్తిదాయక ప్రసంగంలోని ముఖ్యాంశాలు..(ఆయన మాటల్లోనే)

 

  • నమస్తే. గుడ్ ఈవినింగ్ వెంబ్లీ.. ఇది చారిత్రాత్మకమైన రోజు. రెండు పెద్ద దేశాలు.. రెండు సమున్నత ప్రజాస్వామ్య దేశాల కల యిక చోటు చేసుకున్న రోజు. ఈ రెండు దేశాల ఐక్యతతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది.
  • 12 ఏళ్ల తరువాత మళ్లీ ఇక్కడికి వచ్చాను. అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చాను. ఇప్పుడు పెద్ద బాధ్యత తలకెత్తుకుని వచ్చాను. భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరి స్వప్నాలను సాకారం చేయాల్సిన బాధ్యతను చేపట్టి ఇక్కడికి వచ్చాను.
  • భారత్ పేద దేశంగా ఉండడానికి కారణం లేదు. ఈ 18 నెలల పాలనలో నాకీ విషయం అర్థమైంది. కారణం లేకుండానే భారత్‌ను పేద దేశం చేశారు. పేదరికాన్ని ఆస్వాదించడాన్ని మనకు అలవాటు చేశారు.
  • 125 కోట్ల భారతీయుల్లో 60% 35 ఏళ్లలోపు వయసున్నవారే. ఆ యువశక్తిపై నాకు అపార నమ్మకముంది. వారి శక్తి సామర్ధ్యాలపై ఆధారపడి భారత్ ముందడుగు వేస్తుంది. ఇకపై భారత్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.
  • బ్రిటన్ ప్రధాని కామెరాన్ నాతో మాట్లాడిన ప్రతీసారి ఇక్కడి భారతీయుల గురించి గొప్పగా చెప్తారు. అది మీ గొప్పదనమే. భారతీయ విలువలను మీరు ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. ప్రపంచదేశాల్లోని భారతీయులే మా అంబాసిడర్లు. భారత్ శక్తి గురించి ప్రపంచానికి తెలిసింది మీ వల్లే.
  • మహాత్మాగాంధీ విగ్రహం ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన బ్రిటన్ పార్లమెంట్ ముందు ఉండటం ప్రతీ భారతీయుడికి గర్వకారణం.
  • గుజరాత్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్యాంజీ కృష్ణ వర్మ ఇక్కడ న్యాయవాదిగా పనిచేస్తూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటున్నందుకు ఆయన న్యాయవాద పట్టాను రద్దు చేశారు. ఇప్పుడు కామెరాన్ కాలాన్ని వెనక్కు తిప్పారు. ఆ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. శ్యామ్‌జీ అస్థికలను నేనే 2003లో ఇక్కడికి వచ్చినప్పుడు భారత్ తీసుకువెళ్లాను.
  • భారతదేశ వైవిధ్యత గురించి, భిన్నత్వం గురించి అంతా ఆశ్చర్యపోతుంటారు. విదేశీ అధినేతలు నన్ను అడుగుతుంటారు. ఇంత భిన్నత్వం, వైవిధ్యత మధ్య శాంతియుత జీవనం భారత్‌లో ఎలా సాధ్యమైందని అడుగుతుంటారు. నేను వారికి చెప్పాను.. వైవిధ్యతే మా శక్తి. మా బలం. మా ప్రత్యేకత అని వారికి చెప్పాను. మా ఆశ, శ్వాస, విశ్వాసం అదే.
  • సూఫీ తత్వం సమున్నతమైంది. దాన్ని ముస్లింలు సహా అందరూ అర్థం చేసుకుంటే ఎవరూ ఆయుధం పట్టుకోరు. హింసను ఆశ్రయించరు.
  • భారత్‌పై ప్రపంచ దేశాల దృష్టి మారింది. సానుకూల దృక్పథంతో చూస్తున్నారు. గౌరవంతో చూస్తున్నారు. సమాన స్థాయిలో గౌరవం ఇస్తున్నారు.
  • మేం కోరుకుంటోంది కూడా సమానత్వమే. మెహర్బానీ మాకు అవసరం లేదు. భారత్‌తో కలిసి ప్రగతి పథంలో నడవాలని ప్రపంచం ఇప్పుడు కోరుకుంటోంది.
  • ప్రపంచం ముందున్న సవాళ్లు ఉగ్రవాదం, భూ తాపోన్నతి. వాటిపై పోరులో భారత్ ప్రపంచ దేశాలతో కలిసి వస్తుంది. ఆ భాద్యతను స్వీకరిస్తుంది.
  • గాంధీజీ జీవితం, ఆయన ఉపదేశాలు నేటికీ ఆచరణీయం. వాటిని ఆచరిస్తే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది.
  • అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ను అంతర్జాతీయ సంస్థలన్నీ గుర్తిస్తున్నాయి. ఈ అభివృద్ధి ఫలాలు త్వరలోనే అందరికీ అందుతాయి.
  • స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లయినా భారత్‌లోని 18 వేల గ్రామాల్లో ఇంకా విద్యుత్ సౌకర్యం లేదు. వెయ్యి రోజుల్లో ఆ గ్రామాలకు వెలుగులు పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
  • ఒక చాయ్ అమ్ముకున్న వ్యక్తి, ఓ పేదవాడి కొడుకు ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయగలడని కలలో కూడా అనుకోలేదు. కానీ అది సాధ్యమైంది. అప్పటి ప్రసంగంలో స్వచ్ఛభారత్ గురించి నేను చెప్పినప్పుడు అంతా నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నారు.
  • టాయిలెట్లు లేని కారణంగా బాలికలు పాఠశాలలకు వెళ్లని పరిస్థితిని గమనించాను. అందుకే పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాన్ని ఉద్యమంలా ప్రారంభించాం. పూర్తిచేశాం.
  • జనధన యోజన కింద 100 -150 రోజుల్లో 19 కోట్ల పేదలకు బ్యాంక్ అకౌంట్స్ అందించాం.
  • బాండ్ అంటే మొదట గుర్తొచ్చేది జేమ్స్ బాండ్. ఆతరువాత గుర్తొచ్చేది బ్రూక్‌బాండ్ టీ. కానీ ఇప్పుడు ఆ బాండ్‌లకు మరో బాండ్ జత చేరింది. అది రూపీ బాండ్.
  • రైల్వేల ఆధునీకరణ కోసం ఆ రంగంలో 100% ఎఫ్‌డీఐలకు అనుమతించాం. మా దృష్టిలో ఎఫ్‌డీఐ అంటే ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు.  ఎఫ్‌డీఐ అంటే.. ఫస్ట్ డెవలప్ ఇండియా.
  • రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. రక్షణ రంగ అవసరాలను దేశీయంగా ఉత్పత్తి చేయడమే మా లక్ష్యం.
  • సౌరశక్తి అపారంగా లభించే దేశాలతో ఒక కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ఒపెక్, జీ20, జీ 7 తరహాలో ‘సూర్యపుత్ర దేశాల కూటమి’ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. సౌరశక్తిని ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మారుస్తాను. పారిస్ పర్యావరణ సదస్సులో ఆ పని మీదే ఉంటాను.
  • 175 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పని చేస్తున్నాం.
  • అవినీతిపై రేటింగ్స్ ఇచ్చే ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ భారత్‌కు సానుకూల రేటింగ్స్ ఇచ్చింది. అవినీతి తగ్గుతోందంటూ ప్రకటించింది.
  • నైపుణ్య భారత్, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్.. ఇవన్నీ ఆధునిక భారత్‌ను రూపొందించే లక్ష్యంతో ప్రారంభించినవే.
  • ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), పీఐఓ(పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్)లను విలీనం చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదులను పరిష్కరించే ప్రయత్నం చేపట్టాం.
  • విదేశాల్లోని భారతీయులకు సహకారం అందించే లక్ష్యంతో ‘మదద్’ పోర్టల్‌ను ప్రారంభించాం. వలస సమస్యల పరిష్కారం కోసం ఈ మైగ్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించాం.
  • విదేశాల్లోని భారతీయులకు అవసరమైన సమయాల్లో ఆర్థిక సాయం అందించడం కోసం ‘ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్’ను ప్రారంభిస్తున్నాం.  
  • 2003లో నా చొరవతో లండన్- అహ్మదాబాద్ డెరైక్ట్ విమాన సర్వీస్ ప్రారంభమైంది. కానీ కొద్దిరోజులకే అది ఆగిపోయింది. కారణాలేంటో మీకు తెలుసు. ఇప్పుడు మళ్లీ ఈ డిసెంబర్ 15 నుంచి ఆ సర్వీస్ మళ్లీ ప్రారంభమవుతోంది.
  • యూరోప్ ఇండియా ఫోరం అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 60 వేల మంది ఇండో బ్రిటిషర్లు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement