ఇంగ్లండ్‌కు ‘ఇండియన్’ ప్రధాని
- ఆ రోజు ఎంతో దూరం లేదు: కామెరాన్
- ‘అచ్చేదిన్ జరూర్ ఆయేంగే’ అంటూ వెంబ్లీలో సందడి
లండన్: యునెటైడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రిగా.. బ్రిటిష్-ఇండియన్ ఎన్నికయ్యే రోజు ఎంతో దూరంలో లేదంటూ ఆ దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ పేర్కొనటంతో లండన్‌లోని వెంబ్లీ స్టేడియం కేరింతలతో హోరెత్తింది. మోదీ కన్నా ముందు స్టేడియంలో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన కామెరాన్.. పలుసందర్భాల్లో గుజరాతీ, హిందీ వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు.
‘నమస్తే వెంబ్లీ’ అంటూ మొదలుపెట్టిన ఆయన.. ‘కేమ్ చో!’ అంటూ గుజరాతీలో సభికులను కుశలం అడిగారు. వివిధ రంగాల్లో బ్రిటిష్-ఇండియన్లు చేసిన కృషిని ప్రస్తావించారు. భారత్, బ్రిటన్ సంబంధాలు ప్రజలకు, సుసంపన్నతకు సంబంధాలని అభివర్ణించారు. చివర్లో మోదీ ఎన్నికల నినాదాన్ని అనుకరిస్తూ.. ‘అచ్ఛే దిన్ జరూర్ ఆయేంగే’ అనటంతో స్టేడియం హర్షధ్వానాలతో మార్మోగింది. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
‘‘నమస్తే వెంబ్లీ! ప్రపంచంలో అత్యంత విజయవంతమైన బహుళ జాతుల ప్రజాస్వామ్యంగా మనం ఉన్నాం. అందులో బ్రిటిష్ ఇం డియన్ల పాత్ర ఎంతో ఉంది. ఒక బ్రిటిష్-ఇండియన్ (బ్రిటన్ పౌరసత్వం గల భారత సంతతి వ్యక్తి) యునెటైడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రిగా టెన్ డౌనింగ్ స్ట్రీట్ (ప్రధాని నివాసం)లోకి వచ్చే రోజు దూరంలో లేదు. ప్రధాని మోదీ, నేను సవాళ్లతో కూడిన కాలంలో పరిపాలిస్తున్నాం. కానీ.. మా ప్రగాఢ ఆకాంక్షల కారణంగా సమైక్యంగా ఉన్నాం.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మేం మద్దతిస్తున్నాం. టీమ్ ఇండియా - టీమ్ యూకే.. మనమిద్దరం కలిస్తే అది గెలిచే జట్టు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేం కలసికట్టుగా నిలుచున్నాం. మీరు ముంబైలో బాధపడ్డారు. మేం లండన్‌లో బాధను చవిచూశాం. మనం ఉమ్మడిగా వారిని ఓడిస్తాం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని ఒక చాయ్‌వాలా పరిపాలించలేరని విమర్శకులు అన్నారు.. కానీ ఆయన (మోదీ) వారి అంచనా తప్పు అని నిరూపించారు. అచ్ఛే దిన్ జరూర్ ఆయేంగే!’’
కిక్కిరిసిన వెంబ్లీ...
బ్రిటన్‌లో దాదాపు 15 లక్షల మంది ప్రవాసభారతీయులు నివసిస్తున్నారు. లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో మోదీ కార్యక్రమానికి 60 వేల మందికి పైగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా.. అలీషా చినాయ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ పాటతో ప్రదర్శన నిర్వహించారు. కనికాకపూర్ ప్రదర్శన నిర్వహించారు. బాలీవుడ్ సినీ గీతాల ప్రదర్శనలు, ఎన్‌డీఏ సర్కారు ముఖ్య కార్యక్రమాలు, విజయాలతో వీడియోను ప్రదర్శించారు.
స్టేడియాన్ని ‘మోదీ.. మోదీ’ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమాల చివర్లో వందేమాతర గీతం ఆలపించారు. బ్రిటన్ ప్రధాని కామెరాన్ భార్య సమంత భారత సంప్రదాయ రీతిలో చీర కట్టుకుని స్టేడియంకు రావటం విశేషం. స్టేడియం వద్ద మోదీకి కామెరాన్ దంపతులు స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ప్రధానులు కార్యక్రమ నిర్వాహకులు, జాతీయ గీతాలు ఆలపించిన విద్యార్థులు, కళాకారులతో ముచ్చటించారు. తొలుత కామెరాన్, తర్వాత మోదీలు ప్రసంగించారు.