‘ఉగ్ర’ దేశాలను ఒంటరిని చేయాలి
ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలను ఏకాకి చేయాలి
♦ బ్రిటన్ పార్లమెంట్ సభ్యులనుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని
♦ మోదీకి బ్రిటన్ ఎంపీల స్టాండింగ్ ఒవేషన్
లండన్: ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సాయం చేస్తున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చేవారిని బహిష్కరించి, ఏకాకిని చేసే విషయంలో ఒక అంతర్జాతీయ తీర్మానం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదంపై నిజాయితీగా పోరు చేస్తున్న దేశాలకు బాసటగా నిలిచే విషయంలోనూ ఒక్కమాటపై నిలవాలన్నారు. బ్రిటన్ ఎంపీలను ఉద్దేశించి గురువారం మోదీ ప్రసంగించారు. యూకే పార్లమెంట్‌లోని రాయల్ గ్యాలరీలో ఎంపీలనుద్దేశించి ప్రసంగిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ అక్కడికి అడుగుపెట్టగానే.. బ్రిటన్ ఎంపీలంతా లేచి నిల్చొని స్వాగతం పలికారు. పార్లమెంట్లోని రాయల్ గ్యాలరీ నుంచి 25 నిమిషాల పాటు ప్రసంగించిన మోదీ.. సమకాలీన సమాజపు అతిపెద్ద ప్రమాదమైన ఉగ్రవాదంపై పోరును అంతర్జాతీయ సమాజం ఐకమత్యంగా సాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఉగ్రవాద సంస్థల మధ్య తేడాను, దేశాల మధ్య వివక్షను చూపొద్దని పిలుపునిచ్చారు. అఫ్ఘాన్ భవిష్యత్తు అఫ్ఘాన్ ప్రజల ఆకాంక్షల మేరకే ఉండాలి కానీ.. ఇతరుల ఆశల మేరకో.. లేక ఇతర దేశాల అనవసర భయాల మేరకో ఉండకూడదని స్పష్టం చేశారు. బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్న మోదీ.. ప్రస్తుత సమాజానికి కూడా ఆధునికత ప్రమాణం లండనేనన్నారు. ‘భారత్ ప్రపంచ దేశాలకు ఇప్పుడు అవకాశాల స్వర్గధామం. ఈ సమయంలో మీరు భారత్‌లో పర్యటిస్తే ఆ సానుకూల మార్పును మీరు కూడా గుర్తిస్తారు’ అన్నారు. భారత్‌లో ‘సమాఖ్య వ్యవస్థ స్థానంలో టీమ్ ఇండియా’ భావనను తీసుకువచ్చామన్నారు.
భారత్, యూకేల చరిత్రాత్మక భాగస్వామ్యం గురించి చెబుతూ.. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, తాజా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను మోదీ గుర్తు చేశారు. మోదీ ప్రసంగంలోని చతురోక్తులకు బ్రిటన్ ఎంపీలు పలుమార్లు నవ్వుల్తో స్పందించారు. ఇటీవలి ఎన్నికల్లో కామెరాన్ ఉపయోగించిన నినాదం ‘మళ్లీ ఒకసారి.. కామెరాన్ ప్రభుత్వం’ అనేది తనదేనని, దానికి తనకు కామెరాన్ రాయల్టీ ఇవ్వాలని మోదీ చమత్కరించారు. అంతకుముందు, పార్లమెంట్ వెలుపల మోదీ, కామెరాన్‌లు మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
హక్కుల ఉల్లంఘనలపై ప్రశ్నించండి!
భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై మోదీని ప్రశ్నించాలంటూ ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ సహా 46 మంది ఎంపీలు బ్రిటన్ ప్రధాని కామెరాన్‌కు ఒక పార్లమెంటరీ తీర్మానాన్ని పంపించారు.
ఆశలకు వెలుగుచుక్క భారత్.. ‘ఆశలకు, అవకాశాలను సరికొత్త వెలుగుచుక్కగా భారత్ అవతరిస్తోంది. రక్షణ, వాణిజ్యం, గృహనిర్మాణం, సేవలు, తదితర రంగాల్లో భారత్‌లో అపార అవకాశాలున్నాయి. భారత్‌లో పాలనలో పారదర్శకత, నిర్ణయాల్లో వేగం, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ.. మొదలైన సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. గాంధీజీ చెప్పిన ప్రకారం.. మార్పు మాలోనే ప్రారంభమైంది. అందరికి విద్యుత్తు, తాగునీరు, ఇల్లు, పారిశుద్ధ్య వసతి మొదలైన లక్ష్యాల సాధనకు గడవును నిర్దేశించుకుని పని చేస్తున్నాం. భారతీయ చరిత్రలో చాలా భాగం బ్రిటన్ పార్లమెంట్లోనే లిఖితమైంది’ అని మోదీ పేర్కొన్నారు.