భారత్ సరికొత్త ఆశాకిరణం: మోదీ
లండన్: ఆర్థిక మందగమనం నుంచి బ్రిటన్ పునరుత్థానం చెందిన తీరు ఆసక్తికరమని, అదేసమయంలో ప్రస్తుతం ప్రపంచానికి భారత్ సరికొత్త ఆశాకిరణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఉమ్మడిగా గళమెత్తాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఐరాసలో ఉగ్రవాదంపై ఒకే నిర్వచనం ఉండేలా అందరూ మద్దతు పలుకాలని బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ కోరారు.
భారత ప్రధానమంత్రి బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ మాట్లాడుతూ భారత సమాఖ్య విధానాన్ని ఇప్పుడో కొత్త అర్థం చెబుతున్నామని, భారత సమాఖ్య అంటే టీమిండియా అన్నది మా దృక్పథమని పేర్కొన్నారు. మారుతున్న భారతాన్ని చూడాలంటే మీరు భారత్‌ను సందర్శించాలని చెప్పారు. భారత్-బ్రిటన్ ఆర్థిక బంధం కొత్త పుంతలు తొక్కుతున్నదన్నారు. భారత్‌లో కొత్త రంగాల్లో పెట్టుబడులకు తలుపులు తెరిచామని చెప్పారు. అణుశక్తి, పునరుత్పాదక వనరుల విషయంలో బ్రిటన్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి బాధ్యతతో ముందుకు సాగాల్సిన అవసరముందని చెప్పారు. కలల భారత సాకారం ఇప్పుడు మనముందు నిలిచి ఉందని, భారత్ ప్రగతితో ప్రపంచంలో ఆరోవంతు మానవాళి తలరాత మారుతుందని పేర్కొన్నారు.