బ్రిటన్ గడ్డపై మోదీ
భారత్-బ్రిటన్‌ల మధ్య చిరకాలంగా ఉన్న సంబంధాలు మరో మలుపు తీసుకోబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మూడు రోజుల పర్యటన కోసం బ్రిటన్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం 2006లో మన్మోహన్‌సింగ్ పర్యటించాక తర్వాత మన ప్రధాని ఒకరు ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఇందుకు భిన్నంగా 2010లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక డేవిడ్ కామెరాన్ మన దేశంలో మూడుసార్లు పర్యటించారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. శరవేగంతో ఎదిగే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది. అందుకు అవసరమైన వనరులూ, శక్తిసామర్థ్యాలూ భారత్‌కు పుష్కలంగా ఉన్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్న మాట. దీనికి తోడు ఏ దేశంలోనూ లేనివిధంగా మన దేశంలో పాతికేళ్ల లోపున్న యువత 60 కోట్లమంది ఉన్నారు.
అంతేకాదు...బ్రిటన్‌లో కంటే మన దేశంలోనే శత కోటీశ్వరుల సంఖ్య ఎక్కువట. ఇన్ని అనుకూలాంశాలున్న దేశంతో ఎవరైనా మరింత సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. మన దేశంతో వాణిజ్య సంబంధాలున్న తొలి 25 దేశాల్లో బ్రిటన్ 18వ స్థానంలో ఉంది. ఇరు దేశాలమధ్యా ఉన్న వాణిజ్యం విలువ ప్రస్తుతం 1,434 కోట్ల డాలర్లు. ఈమధ్యకాలంలో మన దేశంలో బ్రిటన్‌కు సంబంధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఇతోధికంగా పెరిగాయి. మరోపక్క యూరప్‌లోని మిగిలిన దేశాలకంటే బ్రిటన్‌లోనే భారత్ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడున్న దాదాపు 700 భారతీయ వ్యాపార సంస్థల్లో, పరిశ్రమల్లో 1,10,000మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మరోపక్క బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇటీవలికాలంలో కోలుకుంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం అందుకు నిదర్శనం.
ఇరు దేశాలమధ్యా ద్వైపాక్షిక సంబంధాల స్థాయిని మరింత పెంచడానికి మోదీ పర్యటన దోహదపడుతుందని కామెరాన్ ఆశాభావంతో ఉన్నారు. దానికి అనుగుణంగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాలమధ్యా 1,500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలు కుదరబోతున్నాయి. ఇందులో 20 హాక్ ట్రైనర్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కూడా భాగమే. ఈ విమానాల కొనుగోలుకు 2004లో తొలిసారి ఒప్పందం కుదిరాక ఇంతవరకూ మన వైమానిక దళం ఈ తరహా విమానాలు 123 కొనుగోలు చేసింది. ఒప్పందాన్ని అనుసరించి ఇందులో కొన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)లో తయారయ్యాయి.
టోనీ బ్లెయిర్ బ్రిటన్ ప్రధానిగా ఉండగా ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. అయినా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్ సమస్య విషయంలోగానీ, కశ్మీర్ సమస్యపైగానీ ఇరు దేశాలమధ్యా ఏకాభిప్రాయం లేకపోవడమే ఇందుకు కారణం. కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంవల్లే దక్షిణాసియాలో మత తీవ్రవాదం పెచ్చరిల్లుతున్నదని...ఆఫ్ఘాన్‌లో ప్రశాంతత ఏర్పడాలంటే ముందు క శ్మీర్ పరిష్కారం కావాలని 2009లో అప్పటి బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ మిలిబాండ్ వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని అప్పట్లో మన దేశం స్పష్టంచేసింది. మిలిబాండ్ దాన్ని విస్మరించి పాక్‌పై పక్షపాతం ప్రదర్శించారని విమర్శించింది. అంతేకాదు...2010లో అఫ్ఘాన్ సమస్యపై నిర్వహించిన లండన్ కాన్ఫరెన్స్‌ద్వారా తాలిబన్లను ప్రధాన స్రవంతికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది. ఇది పాకిస్తాన్‌కు మేలు చేయడమే అవుతుందని, సమస్య తీవ్రతనూ, దాని పుట్టుకనూ విస్మరించడమే అవుతుందని మన దేశం హెచ్చరించింది.
మరోపక్క వాతావరణ మార్పులు, బ్రిటన్‌లో భారత విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం తదితర అంశాల్లో కూడా ఇరు దేశాలకూ వేర్వేరు అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా మూడు నెలలక్రితం బ్రిటన్ వలస నిబంధనల్లో చేసిన మార్పులవల్ల వేలాదిమంది భారతీయ నర్సులకు అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆరేళ్ల తర్వాత 35,000 పౌండ్ల జీతాన్ని పొందగలిగేవారే తమ దేశంలో ఉండటానికి అర్హులని తాజా నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పుడున్న వేతనాలను దృష్టిలో ఉంచుకుంటే ఆరేళ్ల తర్వాత ఆ స్థాయికి చేరగలవారి సంఖ్య చాలా తక్కువుంటుందని ఆందోళన వ్యక్తమైంది. ఆ ప్రాతిపదికన లెక్కలేసి రాగల రెండేళ్లలో చాలామందిని బయటకు పంపే ఉద్దేశం బ్రిటన్‌కు ఉంది. ఇది మాత్రమే కాదు...నర్సింగ్ శిక్షణా కేంద్రాలకు నిధుల కేటాయింపును కూడా బ్రిటన్ సర్కారు గణనీయంగా తగ్గించింది.
విదేశీయులకు అవకాశాలు లభించకుండా చేయడమే ఈ చర్యలోని ఆంతర్యమని విమర్శలు చెలరేగాయి. ఒకపక్క రక్షణతో సహా వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలను విస్తరించుకుని లాభపడాలని చూస్తున్న బ్రిటన్...మన దేశంనుంచి వెళ్లే విద్యార్థులకూ, వృత్తిగత నిపుణులకూ అవకాశాలను కుదించేలా చేయడం ఆందోళన కలిగించే అంశం. యూరప్ దేశాలన్నిటి పెట్టుబడులకంటే బ్రిటన్‌లో మన దేశం పెట్టుబడులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి పౌరులకిచ్చే వెసులుబాటు మన దేశంనుంచి వెళ్లేవారికి ఇవ్వకపోవడం అన్యాయమవుతుందని తోచకపోవడం విచిత్రం. ఇవన్నీ నరేంద్ర మోదీ పర్యటనలో చర్చకొస్తాయి.
బ్రిటన్ పార్లమెంటునుద్దేశించి మన ప్రధాని ఒకరు ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ అవకాశాన్ని గురువారం నరేంద్ర మోదీ సమర్థవంతంగానే వినియోగించుకున్నారు. ఉగ్రవాదంపై ప్రపంచమంతా ఒకే గొంతుతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ఈ అంశంలో బ్రిటన్ ఆలోచనా తీరును దృష్టిలో పెట్టుకునే ఆయన ఇలా చెప్పవలసి వచ్చింది. దౌత్యంలో నిర్మొహమాటంగా ఉండటం, మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం అవసరం. మోదీ ఆ పని చేశారు. మొత్తానికి ఆయన పర్యటన ఇరు దేశాల సంబంధాలనూ మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లగలదని ఆశించాలి.