అసహనాన్ని సహించం..!
భారత్‌లో అసహనంపై యూకేలో స్పందించిన మోదీ
♦ అసహన ఘటనల్ని తీవ్రంగా తీసుకుంటామని స్పష్టీకరణ
♦ {బిటన్ ప్రధానితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మోదీ
♦ పౌర అణు ఒప్పందం సహా రూ.90,500 కోట్ల విలువైన ఒప్పందాలు
లండన్: స్వదేశంలో తీవ్రస్థాయి విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో నెలకొన్న అసహన వాతావరణంపై స్పందించని ప్రధాని మోదీకి.. విదేశంలో ఆ అంశంపై స్పందించాల్సివచ్చింది. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో చర్చల అనంతరం మోదీ, కామెరాన్‌లు సంయుక్తంగా పాల్గొన్న మీడియా సమావేశంలో అసహనంపై, 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ విలేకరి మోదీని ప్రశ్నించారు. దానికి.. భారత్‌లోని ఏ భాగంలోనూ అసహనానికి సంబంధించిన ఘటనలను సహించబోమని మోదీ హామీ ఇచ్చారు. ‘గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీలు నడయాడిన నేల భారత్. దేశ మౌలిక విలువలకు వ్యతిరేకంగా జరిగే ఏ ఘటనలనైనా భారతీయ సంస్కృతి ఆమోదించదు. అసహనాన్ని భారత్ అంగీకరించబోదు. ఏ చిన్న ఘటననైనా.. 125 కోట్ల ప్రజలున్న భారతావనిలో దాని ప్రాముఖ్యత ఏ స్థాయిదైనా.. భారత్ ఆమోదించబోదు. మా దృష్టిలో ప్రతీ అసహన ఘటనా తీవ్రమైనదే. వాటిని సహించబోం.
వాటిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. పౌరులందరి ప్రాణాలు, ఆలోచనలకు రక్షణ కల్పించే రాజ్యాంగం ఉన్న ప్రజాస్వామ్య దేశం భారత్’ అంటూ మోదీ సమాధానమిచ్చారు. ‘గతంలో మీరు ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ అల్లర్లను కారణంగా చూపి మోదీకి యూకేలో అడుగుపెట్టే అవకాశమివ్వలేదు. ఇప్పుడు అదే మోదీని స్వాగతించడం ఎలా ఉంది?’ అన్న గార్డియన్ పత్రికకు చెందిన విలేకరి ప్రశ్నకు కామెరాన్ సమాధానమిస్తూ.. ‘భారత ప్రజలిచ్చిన అద్భుతమైన, భారీ తీర్పుతో ప్రధాని హోదాలో యూకే వచ్చిన మోదీని స్వాగతించడం సంతోషంగా ఉంది’ అన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. బ్రిటన్‌కు రాకుండా గతంలో కూడా తననెవరూ నిరోధించలేదని, 2003లో తాను యూకే వచ్చానని గుర్తు చేశారు.
పౌర అణు ఒప్పందం.. మోదీ పర్యటన సందర్భంగా భారత్, బ్రిటన్‌ల మధ్య పౌర అణు ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు మద్దతిస్తున్నట్లు బ్రిటన్ పునరుద్ఘాటించింది. ఇరుదేశాల మధ్య 900 కోట్ల పౌండ్ల (రూ.90,500 కోట్లు) ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, సైబర్ సెక్యూరిటీపై సహకరించుకోవాలని నిర్ణయించాయి. ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ వివరాలను మోదీ, కామెరాన్‌లు వెల్లడించారు. పుణే, హైదరాబాద్‌లలో కొత్త సాంకేతిక కేంద్రాల ఏర్పాటులో సహకారంపై ఒక ఒప్పందం కుదిరింది. ‘భారత్‌లో పెట్టుబడుల విషయంలోనెంబర్ వన్ భాగస్వామి కావాలనుకుంటున్నాం. ప్రభుత్వ ప్రాయోజిత రూపీ బాండ్లు సహా 100 కోట్ల పౌండ్ల విలువైన బాండ్ల విడుదలతో.. విదేశాల్లో రూపీ ట్రేడింగ్‌లో లండన్ తొలి స్థానంలో నిలవాలన్నది మా లక్ష్యం’ అని కామెరాన్ చెప్పారు. భారత్‌లో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో లండన్‌ను కేంద్రంగా చేసుకోవాలనుకుంటున్నట్లు మోదీ తెలిపారు. భారత రైల్వేల ప్రస్థానం లండన్‌లోనే మొదలైందన్న మోదీ.. రైల్వే రూపీ బాండ్‌ను లండన్‌లో ఆవిష్కరించడం సంతోషకరమన్నారు.