
పేద రైతులకు రుణాలిస్తే..బ్యాంకులేమీ మూతబడవు
వారిపట్ల ఉదారంగా వ్యవహరించండి...
ఆర్‌బీఐ 80వ వార్షికోత్సవంలో
బ్యాంకర్లకు ప్రధాని మోదీ సూచన
ముంబై: రైతుల ఆత్మహత్యల ఉదంతాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో పేద రైతులకు రుణాలివ్వడం, వసూలు చేసుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పేదలకు సహాయం చేయడం వల్ల బ్యాంకులేమీ మూతబడిపోవని వ్యాఖ్యానించారు. గురువారం రిజర్వ్ బ్యాంక్ 80వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు చెప్పారు. ‘ఆర్‌బీఐ 80వ వార్షికోత్సవ తరుణంలో.. రుణ భారంతో ఏ రైతూ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసేలా బ్యాంకింగ్ రంగాన్ని విస్తరించాలి.
ఈ కలను సాకారం చేసుకోలేమా? పేదలకు చేయూతనివ్వడం వల్ల బ్యాంకులు మూతబడతాయని నేను అనుకోవడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యల వల్ల కలిగే బాధ కేవలం పేపర్లు, టీవీ స్క్రీన్‌లకే పరిమితం కాకుండా బ్యాంకర్లు తగు రీతిలో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘మన దగ్గర రుణం తీసుకున్నందున ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడే అన్న బాధ బ్యాంకర్ల మనస్సులను కూడా కదిలిస్తోందా?’ అని మోదీ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను పేదలు, బడుగులప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మీరు నా నమ్మకాన్ని వమ్ముచేయరని ఆశిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఇన్‌ఫ్రా రంగ ప్రాజెక్టులకు భారీగా రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరించాలని రాజన్ సూచించారు. మరోవైపు ఆర్‌బీఐ ఎంతో ప్రొఫెషనలిజంతో దేశానికి సేవ చేస్తోందని జైట్లీ పేర్కొన్నారు.
ఆర్‌బీఐకి మార్గదర్శ ప్రణాళిక..
ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సాధించేందుకు 20 ఏళ్ల మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆర్‌బీఐకి ప్రధాని సూచించారు. 2019లో మహాత్మా గాంధీ 150వ జయంతి, 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 2025లో ఆర్‌బీఐ 90వ వార్షికోత్సవం, 2035లో రిజర్వ్ బ్యాంక్ 100వ వార్షికోత్సవం లాంటి కీలకమైన మైలురాళ్లను నిర్దేశించుకుని తదనుగుణంగా లక్ష్యాలు పెట్టుకోవాలని ఆయన చెప్పారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌లో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషించగలదని చెప్పడానికి వంటగ్యాస్‌కి సంబంధించి నగదు బదిలీ పథకం, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలు విజయవంతం కావడమే నిదర్శనమని ప్రధాని చెప్పారు. మరోవైపు, వంట గ్యాస్ సబ్సిడీని వదులుకునేలా బ్యాంకులు, పారిశ్రామిక సంస్థలు తమ తమ ఉద్యోగులను ప్రోత్సహించాలని మోదీ సూచించారు. ఈ విధంగా కాస్త స్తోమత ఉన్న వారు వదులుకుంటే .. సబ్సిడీ అవసరమున్న మరింత మంది పేదలకు దాన్ని అందించవచ్చని ఆయన చెప్పారు.
రాజన్ .. ఓ మంచి టీచర్..
ఆర్థిక అంశాలపై రాజన్‌కి అపారమైన స్పష్టత, పట్టు ఉందని ప్రధాని కితాబిచ్చారు. ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడని.. ఎంతటి క్లిష్టమైన అంశాన్నైనా మూడు, నాలుగు స్లైడ్స్‌లోనే వివరించగలరని మోదీ పేర్కొన్నారు. రాజన్‌తో రెండు నెలలకోసారి జరిగే సమావేశాలను ప్రస్తావిస్తూ ఆర్‌బీఐ, ప్రభుత్వం ఆలోచనా ధోరణి దాదాపు ఒకే విధ ంగా ఉంటుందని ఆయన చెప్పారు. రైతులకు తోడ్పాటు అందించడంతో పాటు వారి ఆత్మహత్యలు నివారించేటువంటి సృజనాత్మక సాధనాలతో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌కి సంబంధించి మార్గదర్శ ప్రణాళిక రూపొందించాలని బ్యాంకులకు ప్రధాని సూచించారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు చేయూతనిచ్చే బ్యాంకులు.. ఫ్యాక్టరీల కాలుష్యాన్ని తగ్గించే విధంగా సాగు చేసే రైతాంగానికి నిధులు సమకూర్చాలని ఆయన చెప్పారు.
కరెన్సీ నోట్లకు స్వదేశీ పేపరు...
కరెన్సీ నోట్లను ముద్రించేందుకు పేపరు, ఇంకును దిగుమతి చేసుకోవడం కాకుండా ఆర్‌బీఐ దేశీయంగా తయారయ్యే వాటినే వాడటంపై దృష్టి పెట్టాలని ప్రధాని పేర్కొన్నారు. ‘స్వదేశీ ఉత్పత్తుల కోసం పోరాడిన మహాత్మా గాంధీ బొమ్మను.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కరెన్సీ నోట్లపై ముద్రిం చడం హాస్యాస్పదంగా ఉంటుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కరెన్సీ పేపరు, ఇంకును దేశీయంగా తయారు చేయడంపై ఆర్‌బీఐ కసరత్తు చేయాలన్నారు. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే దేశీ పేపరుపైనే కరెన్సీ ముద్రణ జరగగలదని ఈ సందర్భంగా ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా చెప్పారు.