
దేశంలోనే పొడవైన సారంగ మార్గం ప్రారంభం
⇒ కశ్మీర్ అదృష్టాన్ని నిర్ణయించే సొరంగం
⇒ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
చెనాని–నష్రీ సొరంగంపై మోదీ మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 9 సొరంగ మార్గాల్ని నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ సొరంగం రాష్ట్ర అదృష్టాన్ని నిర్ణయించే దారి.. కశ్మీర్ లోయలోని పర్యాటకాన్ని ఇది కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. ఇది కేవలం మౌలిక సదుపాయాల అనుసంధాన వ్యవస్థే కాదు.. హృదయాల్ని కలిపే వారధి’ అని ఆకాంక్షించారు. కశ్మీర్–జమ్మూల మధ్య దూరాన్ని తగ్గించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో ఇదో పెద్ద ముందడుగుగా నిలుస్తుందన్నారు. చెనాని–నష్రీ సొరంగం జమ్మూ కశ్మీర్ రైతులకు ఎంతో ఉపయోగపడడమే కాకుండా రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెంచుతుందని ప్రధాని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రకటించిన రూ. 80 వేల కోట్లకు గాను ఇంతవరకూ విడుదలైన సగం పైగా మొత్తాన్ని అతి తక్కువ కాలంలో ఖర్చుపెట్టినందుకు కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబాను, కశ్మీర్ ప్రభుత్వాన్ని ప్రధాని ప్రశంసించారు.
చెనాని: దేశంలోనే పొడవైన సొరంగ మార్గ రహదారిని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. కశ్మీర్ లోయను జమ్మూతో కలిపే ఈ మార్గాన్ని జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీల సమక్షంలో మోదీ జాతికి అంకితం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం మోదీ, మెహబూబా ముఫ్తీ తదితరులు టన్నెల్ మార్గం ద్వారా జీపులో ప్రయాణించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని చెనాని–నష్రీ ప్రధాన రహదారిలో భాగంగా ఈ సొరంగమార్గ రహదారిని నిర్మించారు.
⇔ తొమ్మిది కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 3,720 కోట్లు ఖర్చు చేసింది.
⇔ ఈ మార్గం వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 31 కిలోమీటర్లు తగ్గడమే కాదు ప్రయాణ సమయం కూడా రెండు గంటలు తగ్గుతుంది.
⇔ ప్రతి రోజూ రూ. 27 లక్షల విలువైన ఇంధనం దీనివల్ల ఆదా అవుతుంది.
⇔ గతంలో ప్రధాన మార్గంలో కొండచరియలు, మంచు, అధిక ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ సొరంగ మార్గంతో పరిష్కారం లభించింది.
⇔ వాహనాదారుల భద్రత నిమిత్తం మార్గం మొత్తం మీద 124 సీసీటీవీ కెమెరాలను, అత్యాధునిక స్కానర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులకు రోడ్డు మార్గం చక్కగా కనపడేలా విద్యుత్ దీపాలను ఏర్పాటుచేశారు.
⇔ వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌తో పాటు అగ్నిమాపక నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
⇔ అత్యవసర సమయాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి ఏర్పాట్లు చేశారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణికులు సురక్షితంగా ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చు.
⇔ ఇది ఆసియాలోనే అతి పొడవైన రెండు మార్గాల సొరంగం..
⇔ ప్రయాణికులకు తాజా గాలిని అందించే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సొరంగ మార్గాల్లో ప్రపంచంలో ఇది ఆరోది... భారత్‌లో మొదటిది.