
పోలవరం కుడి కాలువకు భారీ గండి
ప్రచార ఆర్భాటం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన హడావుడి, తప్పుడు నిర్ణయాలవల్ల
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రచార ఆర్భాటం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన హడావుడి, తప్పుడు నిర్ణయాలవల్ల పోలవరం కుడికాలువకు భారీ గండి పడింది. కుడికాలువ నిర్మాణంలో భాగంగా పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మించిన అక్విడెక్టు (అండర్ టన్నెల్ బ్రిడ్జి) శనివారం రాత్రి బద్దలైంది. 15నుంచి 20 అడుగుల మేర ధ్వంసమైంది.నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టడం వల్ల తాడిపూడి నీళ్లు, వర్షపు నీరు, పట్టిసీమనుంచి కేవలం ఒక్క పంపు ద్వారా విడుదలైన నీటికే ఆక్విడెక్ట్‌కు గండికొట్టేసింది. ఫలితంగా నీరు విడుదల చేసి 24గంటలు కాకముందే పట్టిసీమ మొదటి పంపును శనివారం రాత్రి మూసివేశారు.
నాసిరకపు నిర్మాణం వల్లనే : పోలవరం కుడికాలువ మొత్తం 174 కిలో మీటర్లు కాగా వైఎస్ హయాంలో 140 కిలో మీటర్లు 80 మీటర్ల వెడల్పుతో రెండు వైపులా లైనింగ్ పనులతో సహా పనులు పూర్తిచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పట్టిసీమనుంచి కుడి కాలువలోకి నీళ్లను మళ్లించాలనే పేరుతో మిగిలిన 29.25 కిలోమీటర్ల కాలువ పనులను హడావుడిగా చేయించారు. పనులు త్వరగా పూర్తయ్యేందుకు కాలువ వెడల్పును కొన్నిచోట్ల 40 మీటర్లకు, మరికొన్నిచోట్ల 20 మీటర్లకు కుదించారు.ఈ పనుల్లో నాణ్యత ఉండదని, కుడికాలువ పనులను పర్యవేక్షించే ఇంజినీర్లు మొత్తుకున్నా పట్టించుకోలేదు.
శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించిన పట్టిసీమ మొదటిపంపు సామర్థ్యం 354 క్యూసెక్కులు కాగా, దానికి వరదనీరు, తాడిపూడి లిఫ్ట్‌నీరు కలిసి మూడువేల క్యూసెక్కులకు చేరింది. ఈ నీటి ఒత్తిడి తట్టుకోలేక శనివారం ఇంజినీరింగ్ అధికారులు, స్థానిక నేతలు పరిశీలిస్తుండగానే జానంపేట అక్విడెక్ట్‌కు గండి ఏర్పడింది. దీం తో సుమారు 3వేల క్యూసెక్కుల గోదావరి నీరు తమ్మిలేరు ద్వారా కొల్లేరులో కలిసిపోతోంది. ఈ నీటికే అక్విడెక్ట్ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందంటే పట్టిసీమ మొత్తం సామర్థ్యం 8,500 క్యూసెక్కుల నీరు విడుదలైతే జిల్లా కేంద్రమైన ఏలూరు మునిగిపోయే ప్రమాదం ఏర్పడేది. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాత్రం ఇది పెద్ద విషయం కాదని తేలిగ్గా తీసిపారేశారు.