కృష్ణుడికి అవమానం: లాయర్‌పై బీజేపీ కేసు
ప్రముఖ లాయర్, కొత్త పార్టీ స్వరాజ్ అభియాన్ సహ స్థాపకుడు ప్రశాంత్ భూషణ్‌పై బీజేపీ కేసు పెట్టింది. హిందు దేవుడు శ్రీకృష్ణుడిపై రెచ్చగొట్టేవిధంగా ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్‌పాల్ సింగ్ బగ్గా తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.
ఉత్తరప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యాంటీ రోమియో స్క్వాడ్‌లు ఏర్పాటుచేయడాన్ని ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్‌లో తప్పుబట్టారు. 'రోమియో ఒక్క అమ్మాయిని మాత్రమే ప్రేమించాడు. కానీ కృష్ణుడు లెజండరీ ఈవ్‌టీజర్. తన విజిలెంట్స్‌ను యాంటికృష్ణస్క్వాడ్ అని పిలిచే దమ్ము ఆదిత్యనాథ్‌కు ఉందా' అంటూ భూషణ్ ట్విట్టర్‌లో సవాల్ చేశారు. అయితే, ఈ ట్వీట్ హిందూయిజాన్ని, హిందువులను కించపరచడమే అంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత బగ్గా ప్రశాంత్ భూషణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించారు.