anti-Romeo squad
-
ఆయన ఇంటిపై 'రంగు' పడింది!
శ్రీకృష్ణుడు కూడా ఈవ్టీజరే అంటూ ప్రముఖ న్యాయవాది, స్వరాజ్ అభియాన్ పార్టీ సహ స్థాపకుడు ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. శ్రీకృష్ణుడిని కించపరుస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే బీజేపీ సహా పలువురు వ్యక్తులు కేసులు నమోదు చేశారు. తాజాగా నోయిడా, సెక్టర్ 14లోని ఆయన నివాసంపై కొందరు వ్యక్తులు ఇంకుతో దాడి చేశారు. శ్రీకృష్ణుడిపై వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలంటూ ఏడెనిమిది మంది భూషణ్ ఇంటిముందు గుమిగూడి నినాదాలు చేశారని, ఆ తర్వాత ఇంటిపై, నేమ్ప్లేటుపై ఇంకు చల్లి నిరసన తెలిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమయంలో ప్రశాంత్ భూషణ్ ఇంట్లో లేరు. ఆయన ఇంట్లో పనిచేసేవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేలోపే వారు వెళ్లిపోయారు. పోలీసులు గంటసేపు ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు. 'రోమియో ఒక్క అమ్మాయిని మాత్రమే ప్రేమించాడు. కానీ కృష్ణుడు లెజండరీ ఈవ్‌టీజర్. తన విజిలెంట్స్‌ను యాంటికృష్ణస్క్వాడ్ అని పిలిచే దమ్ము యోగిఆదిత్యనాథ్‌కు ఉందా' అంటూ భూషణ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. హిందూ దేవుడు శ్రీకృష్ణుడిపై రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
కృష్ణుడికి అవమానం: లాయర్‌పై బీజేపీ కేసు
ప్రముఖ లాయర్, కొత్త పార్టీ స్వరాజ్ అభియాన్ సహ స్థాపకుడు ప్రశాంత్ భూషణ్‌పై బీజేపీ కేసు పెట్టింది. హిందు దేవుడు శ్రీకృష్ణుడిపై రెచ్చగొట్టేవిధంగా ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్‌పాల్ సింగ్ బగ్గా తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఉత్తరప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటుచేయడాన్ని ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్లో తప్పుబట్టారు. 'రోమియో ఒక్క అమ్మాయిని మాత్రమే ప్రేమించాడు. కానీ కృష్ణుడు లెజండరీ ఈవ్‌టీజర్. తన విజిలెంట్స్‌ను యాంటికృష్ణస్క్వాడ్ అని పిలిచే దమ్ము ఆదిత్యనాథ్‌కు ఉందా' అంటూ భూషణ్ ట్విట్టర్లో సవాల్ చేశారు. అయితే, ఈ ట్వీట్ హిందూయిజాన్ని, హిందువులను కించపరచడమే అంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత బగ్గా ప్రశాంత్ భూషణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించారు. -
వీడియో హల్చల్: పోలీసులపై వేటు
షాజహాన్‌పూర్: యువతితో సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఓ యువకుడికి స్థానికుల సాయంతో యాంటీ రోమియో బృందం గుండు గీస్తున్నా అడ్డుకోకుండా చూస్తూ ఉన్నందుకు ముగ్గురు పోలీసులు సస్పెండయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని అజీజ్గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ కేవీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సౌత్‌సిటీ కాలనీలో ఓ యువజంట తిరుగుతున్నట్లు అక్కడి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ముగ్గురు కానిస్టేబుళ్లు, యాంటీ రోమియో స్క్వాడ్ అక్కడికి చేరుకున్నారు. వారు అక్కడికి వెళ్లేసరికే ఆ జంటను స్థానికులు పట్టుకుని బంధించారు. యువతిని వెంటేసుకుని తిరుగుతున్నావంటూ యాంటీ రోమియో స్క్వాడ్ ఆ యువకుడికి గుండుగీశారు. ఆ కానిస్టేబుళ్లు చూస్తూ ఊరుకున్నారే తప్ప అడ్డుకునే యత్నం చేయకపోగా.. ఓ కానిస్టేబుల్ ఈ దృశ్యాన్ని తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్‌కు పంపాడు. ఈ క్రమంలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో సుహేల్ అహ్మద్, లాయక్ అహ్మద్, సోన్పాల్ అనే కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కానిస్టేబుళ్లను వెనకేసుకొచ్చేందుకు యత్నించిన అజీజ్గంజ్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి కేకే చౌదరిపై విచారణకు ఆదేశించారు. ఈ మొత్తం ఘటనపై యూపీ ప్రభుత్వం స్పందించింది. ఈవ్‌టీజింగ్ పేరుతో యువతను ఇబ్బంది పెట్టొందంటూ పోలీసులకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. యాంటీ రోమియా స్వ్కాడ్ సిబ్బంది మోరల్ పోలిసింగ్ పేరుతో ఇలాంటివి చేయవద్దని హెచ్చరికలు జారీచేసింది. -
యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటు చేస్తాం
లక్నో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఈవ్ టీజర్లను రోమియోలతో పోల్చారు. ఈవ్ టీజర్ల నుంచి అమ్మాయిలను కాపాడేందుకు ప్రతి కాలేజీల్లో యాంటీ రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమ్మాయిలు క్షేమంగా, సురక్షితంగా ఉండాలని, కాలేజీ క్యాంపస్‌లో యాంటీ రోమియో స్క్వాడ్లు అమ్మాయిలకు అండగా ఉంటాయని, ఆకతాయిలకు భయపడాల్సిన పనిఉండదని చెప్పారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. యూపీలో బీజేపీ అధికారంలో వస్తే మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తామని అమిత్ షా చెప్పారు. శాంతి భద్రతలను కాపాడటంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మహిళల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోలో పలు వరాలు ప్రకటించారు. విద్యార్థులు, రైతులు, మహిళల ఓట్లను ఆకర్షించేందుకు పలు ప్రజాకర్షక పథకాలను మేనిఫెస్టోలో చేర్చారు.