మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం.. | Police removing protesters from Chennai's Marina Beach | Sakshi
Sakshi News home page

మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం..

Published Mon, Jan 23 2017 8:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం..

మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం..

చెన్నై: నిన్నటిదాకా నినాదాలతో హోరెత్తిన చెన్నై మెరీనా బీచ్‌లో ఇప్పుడు బెదిరింపుల కేకలు వినిపిస్తున్నాయి. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నవారిని  పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ కలకలం చెలరేగింది.

ప్రభుత్వ ఆదేశాలమేరకు సోమవారం తెల్లవారుజామున భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు బీచ్‌ను ఖాళీచేయించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు "మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాం.."అని బెదిరించారు. మూకుమ్మడిగా జాతీయగీతాన్ని ఆలపిస్తూ పోలీసులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినాసరే పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఒకవైపు బీచ్‌ను ఖాళీ చేయిస్తూనే, అటువైపునకు వచ్చే దారులన్నింటినీ మూసేశారు.

ఆందోళనలకు నేతృత్వ వహిస్తోన్న బృందం ఒకటి పోలీసులతో మాట్లాడుతూ.. చట్టాన్ని గౌరవిస్తామని, అయితే మధ్యాహ్నం దాకా నిరసనలకు అనుమతినివ్వాలని, ఆ తర్వాత స్వచ్ఛందంగా నిరసన విరమిస్తామని వేడుకున్నారు. కానీ అందుకు పోలీసులు అంగీకరించేదు. "మీ లక్ష్యం నెరవేరింది. జల్లికట్టుకై ఆర్డినెన్స్‌ వచ్చింది. ఆట కూడా మొదలైంది. కాబట్టి మీరు ఆందోళన విరమించి, వెళ్లిపోండి"అని హెచ్చరించారు. అప్పటికీ వెనక్కి తగ్గని నిరసనకారుల్లో కొందరు సముద్రంవైపునకు పరుగెత్తే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకుని, బలవంతంగా వ్యాన్లు ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు.

శాశ్వతపరిష్కారం లభించేదాకా బీచ్‌నుంచి కదిలేదిలేదని బైఠాచించిన నిరసనకారులకు స్థానిక మత్స్యకారులు కూడా తోడవ్వడంతో పోలీసుల ప్రయత్నాలు జఠిలమయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు దారుణంగా కొడుతున్నారని కొందరు యువకులు మీడియాతో అన్నారు. చెన్నైతోపాటు మధురై జిల్లాలోనూ జల్లికట్టుపై శాశ్వత పరిష్కారం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement