ఆగని వేట | police search for muthoot thieves still continues | Sakshi
Sakshi News home page

‘ముత్తూట్‌’ దొంగల కోసం ఆగని వేట

Published Thu, Jul 6 2017 3:33 AM | Last Updated on Tue, Oct 16 2018 5:45 PM

హ్యాపీహోమ్స్‌ అపార్ట్‌మెంట్‌లో వాహనాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యం - Sakshi

హ్యాపీహోమ్స్‌ అపార్ట్‌మెంట్‌లో వాహనాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యం

- ‘ముత్తూట్‌’ దొంగల కోసం సాగుతున్న గాలింపు
- హ్యాపీ హోమ్స్‌లో చిక్కని నిందితులు
- పోలీసుల తనిఖీలకు ముందే పరారీ
- ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం
- మారణాయుధాలు ఉండటం వల్లే ఆక్టోపస్‌ ఆపరేషన్‌ చేపట్టామంటున్న అధికారులు


సాక్షి, హైదరాబాద్‌:
ముత్తూట్‌ ఫైనాన్స్‌ దొంగల కోసం పోలీసులు, ఆక్టోపస్‌ బలగాలు చేపట్టిన భారీ ఆపరేషన్‌ ఏమీ తేలకుండానే ముగిసింది. ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్‌ అపార్ట్‌మెంట్లలో ఉన్న తొమ్మిది బ్లాకుల్లో నూ చేసిన తనిఖీల్లో నిందితులెవరూ పట్టుబడలేదు. దాంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, టోల్‌గేట్ల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పలు రాష్ట్రాలకు నిందితుల చిత్రాలను పంపించి ఆరా తీస్తున్నారు.

రాత్రంతా ఆపరేషన్‌
మంగళవారం ఉదయం హైదరాబాద్‌ శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో దోపిడీకి కొందరు దొంగలు విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు వినియోగించిన టవెరా కారును సాయంత్రం ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద పోలీసులు గుర్తించారు. దొంగలు అపార్ట్‌మెంట్లోనే ఉండవచ్చనే అనుమానంతో భారీ ఆపరేషన్‌ చేపట్టారు. దాదాపు 500 మంది ఆక్టోపస్‌ సిబ్బందితో 9 బ్లాకుల్లోని దాదాపు 750 ఫ్లాట్లలో అణువణువూ గాలించారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం రాత్రంతా సాగిన ఈ తనిఖీల్లో నిందితులెవరూ పట్టుబడలేదు. దాంతో దొంగలను పట్టుకునేందుకు బుధవారం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

అన్ని కోణాల్లోనూ..
దొంగలు మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్‌ కార్యాలయంలో దోపిడీకి యత్నించిన సమయంలో.. ఆ ప్రాంతంలో ఏయే సెల్‌ఫోన్లు పనిచేశాయనే దిశగా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ మేరకు సమాచారం సేకరిస్తున్నారు. ముత్తూట్‌ కార్యాలయంలో వేలిముద్రలు సేకరించారు. ఈ వేలిముద్రలను, ముత్తూట్‌ కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన నిందితుల చిత్రాలను తెలంగాణ, ఏపీలతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాల పోలీసులకు పంపించారు. నిందితులను గుర్తించగలరా, వారిపైనా ఏమైనా కేసులున్నాయా, కనబడితే వెంటనే సమాచారం అందించాలంటూ సమన్వయం చేసుకుంటున్నారు.

దొంగలు ముందే మాయం!
ముత్తూట్‌లో దోపిడీకి విఫలయత్నం చేసిన దొంగలు... మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరామ్‌ఘర్‌ చౌరస్తా వరకు వెళ్లి, అక్కడి నుంచి పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా ప్రయాణించి ఉప్పర్‌పల్లి వద్ద దిగారు. అక్కడ ఆ కారులోంచి ఐదుగురు దిగిపోగా... మిగతా ఇద్దరు ఆ వాహనంలో హ్యపీ హోమ్‌ టవర్స్‌లోకి వచ్చారు. అక్కడ ఆరో నంబర్‌ బ్లాక్‌ వద్ద పార్కింగ్‌ చేసి.. వాహనం నంబర్‌ ప్లేట్‌ను ఊడదీసేసి వెళ్లిపోయారని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించారు. అయితే నిందితులు నగరంలోనే ఉండవచ్చని, వారు బయటకు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు.

ఆరో బ్లాక్‌ వద్ద బందోబస్తు
హ్యాపీ హోమ్స్‌లో బుధవారం సాధారణ పరిస్థితి నెలకొన్నా... ముత్తూట్‌ దొంగలు కారు పార్క్‌ చేసిన ఆరో నంబర్‌ బ్లాక్‌ వద్ద మాత్రం ముందు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ఎస్సై, ఆరుగురు కానిస్టేబుళ్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. కాగా దాదాపు 750 కుటుంబాలు ఉన్న హ్యాపీ హోమ్స్‌ అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు లేవు. గతంలో పోలీసులు దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించినా ఫలితం లేదు. దాతలు ఇచ్చిన ఒక కెమెరాను పోలీసులే ఇక్కడి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేశారు. దానిలోనే తాజాగా ముత్తూట్‌ దొంగల వ్యవహారాన్ని గుర్తించారు.

కుదుటపడిన అపార్ట్‌మెంట్‌ వాసులు
ముత్తూట్‌ దొంగల కోసం పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టడంతో ఉద్రిక్తంగా మారిన హ్యాపీ హోమ్స్‌ అపార్ట్‌మెంట్‌ ప్రాంతం బుధవారం సాయంత్రానికి కుదుటపడింది. మంగళవారం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపినవారంతా బుధవారం ఉదయం నుంచి యథావిధిగా తమ పనులు చేసుకున్నారు. అయితే హ్యాపీ హోమ్స్‌ ఆపరేషన్‌పై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో పెద్ద సంఖ్యలో జనం, యువకులు అక్కడికి రావడం కనిపించింది.

మారణాయుధాలు ఉండడం వల్లే..
ముత్తూట్‌ కార్యాలయంలో దోపిడీకి యత్నించిన వారి వద్ద రివాల్వర్లు, కత్తులు ఉండడం వల్లే.. హ్యాపీ హోమ్స్‌ ఆపరేషన్‌లో ఆక్టోపస్‌ బలగాల సహాయాన్ని తీసుకున్నట్లు రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. ఆ అపార్ట్‌మెంట్‌లో 750 కుటుంబాలు ఉన్నాయని, వారి రక్షణ కోసం ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఈ సోదాల్లో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, టోల్‌గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement