happy homes
-
హ్యాపీ గృహాలు! ఎటుచూసినా హ్యాపీనెస్సే
సాక్షి, హైదరాబాద్: ఆఫీసులో పని ఒత్తిడి నుంచి బయటికి రాగానే ట్రాఫిక్ జాంలు, రణగొణధ్వనులు.. వీటన్నింటి నుంచి తప్పించుకొని కాసేపు సేదతీరాలంటే సొంతిల్లు ఆహ్లాదకరంగా ఉండాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నీటి పరవళ్ల సప్పుళ్లు, ఎటు చూసినా మెదడును ఉత్తేజ పరిచే చిహ్నాలు, బొమ్మలు, కొటేషన్స్, మధుర జ్ఞాపకాలను పదిల పరుచుకునే మెమొరీ బ్యాంక్.. ఆహా ఊహించుకుంటే ఎంతో బాగుంది కదూ! ఎస్.. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్‌కే శ్రీకారం చుట్టింది గిరిధారి హోమ్స్. థీమ్ ప్రాజెక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన గిరిధారి మరో వినూత్న ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మనిషి ఆనందంగా ఉండాలంటే ఆదాయం, పెట్టుబడులు మాత్రమే రెట్టింపయితే చాలదు.. వారి సంతోషాలూ డబులవ్వాలి. అంటే ఉండే పరిసరాలు ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. ఇదే థీమ్‌గా హ్యాపీనెస్ హబ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన హ్యాపీనెస్ కాన్సెప్ట్‌తో కిస్మత్పూర్లో ఐదున్నర ఎకరాలలో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. జీ+5 అంతస్తులలో మొత్తం 567 ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. 1,033 చ.అ. నుంచి 1,601 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. ఎటుచూసినా హ్యాపీనెస్సే: హ్యాపీనెస్ హబ్‌లో ఎటు చూసినా ఆనందాన్ని సూచించే సంకేతాలు, మనస్సును ఆహ్లాదపరిచే ప్రకృతి, పక్షుల కిలకిలారావాలు ప్రతిదీ సంతోషాన్ని రెట్టింపు చేసేలా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌కు 200 మీటర్ల దూరంలో ఈసా రివర్ ఉంటుంది. హ్యాపీ బాడీ, మైండ్, సోల్, హార్ట్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో 20 వేల చ.అ.లలో క్లబ్‌హౌస్ ఉంటుంది. రెండు బ్యాడ్మింటన్ కోర్టులకు ఉత్సాహ, ఉల్లాస అని నామకరణం చేశారు. ఇలా నలభైకి పైగా పేర్లు, హ్యాపీనెస్‌ను ప్రేరేపించే చిహ్నాలను ఎంచుకున్నారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, 2 కి.మీ. జాగింగ్, వాకింగ్ ట్రాక్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కూడా ఈ ప్రాజెక్ట్‌కు వర్తిస్తుంది. దీంతో రూ.2.5 లక్షల వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. లో రైజ్ అపార్ట్మెంట్ కారణంగా కొనుగోలుదారులకు అవిభాస్య స్థలం (యూడీఎస్) ఎక్కువ వస్తుంది. ప్రతి వెయ్యి చ.అ.కు 40 గజాల స్థలం వస్తుంది. మెమొరీ బ్యాంక్: ఈ ప్రాజెక్ట్‌లో నివాసితులకు వినూత్న అనుభూతిని కలిగించేందుకు తొలిసారిగా మెమొరీ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క కొనుగోలుదారులకు ఒక లాకర్‌ను ఇస్తారు. ఇందులో వారి మధుర జ్ఞాపకాలను భద్రపరుచుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత వాటిని చూసుకుంటే అప్పటి మధుర క్షణాలు కళ్లముందు సాక్షాత్కారమవుతాయి. ఇప్పటివరకు గిరిధారి హోమ్స్ కిస్మత్పూర్లో 2 వేల గృహాలను పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందించింది. వచ్చే 12 నెలల్లో మరో 30 లక్షల చ.అ.లలో ప్రాజెక్ట్‌లను ప్రారంభించనుంది. -
ఆగని వేట
- ‘ముత్తూట్’ దొంగల కోసం సాగుతున్న గాలింపు - హ్యాపీ హోమ్స్‌లో చిక్కని నిందితులు - పోలీసుల తనిఖీలకు ముందే పరారీ - ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం - మారణాయుధాలు ఉండటం వల్లే ఆక్టోపస్ ఆపరేషన్ చేపట్టామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ దొంగల కోసం పోలీసులు, ఆక్టోపస్ బలగాలు చేపట్టిన భారీ ఆపరేషన్ ఏమీ తేలకుండానే ముగిసింది. ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లలో ఉన్న తొమ్మిది బ్లాకుల్లో నూ చేసిన తనిఖీల్లో నిందితులెవరూ పట్టుబడలేదు. దాంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, టోల్గేట్ల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పలు రాష్ట్రాలకు నిందితుల చిత్రాలను పంపించి ఆరా తీస్తున్నారు. రాత్రంతా ఆపరేషన్ మంగళవారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీకి కొందరు దొంగలు విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు వినియోగించిన టవెరా కారును సాయంత్రం ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ వద్ద పోలీసులు గుర్తించారు. దొంగలు అపార్ట్మెంట్లోనే ఉండవచ్చనే అనుమానంతో భారీ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 500 మంది ఆక్టోపస్ సిబ్బందితో 9 బ్లాకుల్లోని దాదాపు 750 ఫ్లాట్లలో అణువణువూ గాలించారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం రాత్రంతా సాగిన ఈ తనిఖీల్లో నిందితులెవరూ పట్టుబడలేదు. దాంతో దొంగలను పట్టుకునేందుకు బుధవారం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అన్ని కోణాల్లోనూ.. దొంగలు మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ కార్యాలయంలో దోపిడీకి యత్నించిన సమయంలో.. ఆ ప్రాంతంలో ఏయే సెల్ఫోన్లు పనిచేశాయనే దిశగా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ మేరకు సమాచారం సేకరిస్తున్నారు. ముత్తూట్ కార్యాలయంలో వేలిముద్రలు సేకరించారు. ఈ వేలిముద్రలను, ముత్తూట్ కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన నిందితుల చిత్రాలను తెలంగాణ, ఏపీలతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాల పోలీసులకు పంపించారు. నిందితులను గుర్తించగలరా, వారిపైనా ఏమైనా కేసులున్నాయా, కనబడితే వెంటనే సమాచారం అందించాలంటూ సమన్వయం చేసుకుంటున్నారు. దొంగలు ముందే మాయం! ముత్తూట్‌లో దోపిడీకి విఫలయత్నం చేసిన దొంగలు... మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరామ్‌ఘర్ చౌరస్తా వరకు వెళ్లి, అక్కడి నుంచి పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ప్రయాణించి ఉప్పర్‌పల్లి వద్ద దిగారు. అక్కడ ఆ కారులోంచి ఐదుగురు దిగిపోగా... మిగతా ఇద్దరు ఆ వాహనంలో హ్యపీ హోమ్ టవర్స్‌లోకి వచ్చారు. అక్కడ ఆరో నంబర్ బ్లాక్ వద్ద పార్కింగ్ చేసి.. వాహనం నంబర్ ప్లేట్‌ను ఊడదీసేసి వెళ్లిపోయారని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించారు. అయితే నిందితులు నగరంలోనే ఉండవచ్చని, వారు బయటకు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఆరో బ్లాక్ వద్ద బందోబస్తు హ్యాపీ హోమ్స్‌లో బుధవారం సాధారణ పరిస్థితి నెలకొన్నా... ముత్తూట్ దొంగలు కారు పార్క్ చేసిన ఆరో నంబర్ బ్లాక్ వద్ద మాత్రం ముందు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ఎస్సై, ఆరుగురు కానిస్టేబుళ్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. కాగా దాదాపు 750 కుటుంబాలు ఉన్న హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేవు. గతంలో పోలీసులు దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించినా ఫలితం లేదు. దాతలు ఇచ్చిన ఒక కెమెరాను పోలీసులే ఇక్కడి ప్రధాన రహదారిపై ఏర్పాటు చేశారు. దానిలోనే తాజాగా ముత్తూట్ దొంగల వ్యవహారాన్ని గుర్తించారు. కుదుటపడిన అపార్ట్మెంట్ వాసులు ముత్తూట్ దొంగల కోసం పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టడంతో ఉద్రిక్తంగా మారిన హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ ప్రాంతం బుధవారం సాయంత్రానికి కుదుటపడింది. మంగళవారం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపినవారంతా బుధవారం ఉదయం నుంచి యథావిధిగా తమ పనులు చేసుకున్నారు. అయితే హ్యాపీ హోమ్స్ ఆపరేషన్‌పై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో పెద్ద సంఖ్యలో జనం, యువకులు అక్కడికి రావడం కనిపించింది. మారణాయుధాలు ఉండడం వల్లే.. ముత్తూట్ కార్యాలయంలో దోపిడీకి యత్నించిన వారి వద్ద రివాల్వర్లు, కత్తులు ఉండడం వల్లే.. హ్యాపీ హోమ్స్ ఆపరేషన్‌లో ఆక్టోపస్ బలగాల సహాయాన్ని తీసుకున్నట్లు రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. ఆ అపార్ట్మెంట్లో 750 కుటుంబాలు ఉన్నాయని, వారి రక్షణ కోసం ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఈ సోదాల్లో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రధాన రహదారులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. -
దొంగల కోసమా.. ఉగ్రవాదులా?
హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ సంస్ధలో దోపిడికి విఫలయత్నం చేసిన వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దించారు. దాదాపు 50 మంది ఎస్సైలు, 10 మంది సీఐలు, నలుగురు ఏసీపీలు, ఒక డీఎస్పీ సహా 300 మంది పోలీసులు దొంగలు ఉన్నారని భావిస్తున్న హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. 100 మందికి పైగా ఆక్టోపస్ బలగాలు భారీ ఎత్తున ఆయుధాలతో చేరుకుని 450 ఫ్లాట్ల తనిఖీని ప్రారంభించాయి. ఆక్టోపస్ ఎందుకు? ఆక్టోపస్, కౌంటర్ ఇంటలిజెన్స్, గ్రే హౌండ్స్ బలగాలను సాధారణంగా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లకు వినియోగిస్తారు. దొంగల కోసం ఆక్టోపస్ బలగాలను ఎందుకు రప్పిస్తున్నారన్న విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో కేవలం దొంగలు మాత్రమే కాకుండా అపార్ట్మెంట్లో ఇంకేదో కీలకమైన విషయం ఉంటుందని భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇండియన్ మొజాహిద్దీన్‌కు చెందిన టెర్రరిస్టులు బ్యాంకు దోపిడికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముత్తూట్‌లో దోపడీ యత్నం కూడా ఉగ్రవాదులే చేసుండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. -
స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి బాలుడు మృతి
హైదరాబాద్: స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ప్రమాదవశాత్తు ఓ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉప్పర్‌పల్లి హ్యాపీహోమ్స్‌లో జీబీఆర్ స్విమింగ్‌పూల్ ఉంది. శుక్రవారం సాయంత్రం అత్తాపూర్ ఎంఎంపహాడీ ప్రాంతానికి చెందిన హసన్అలీ కుమారుడు రిజ్వాన్అలీ(12) స్నేహితులతో కలసి ఈత కొట్టేందుకు స్విమింగ్పూల్కు వచ్చాడు. నీటిలోకి దిగి ఈత కొడుతూనే ఒక్కసారిగా రిజ్వాన్ మునిగిపోయాడు. వెంటనే పైకి తీయడం ఆలస్యం కావడంతో అతడు మృతి చెందాడు. ఈత కొలను వద్ద సరైన ముందు జాగ్రత్తలు లేకపోవడంతో చనిపోయాడా? ఈత రాక మృతిచెందాడా? అన్నది తమ దర్యాప్తులో తేలుతుందని ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు. (అత్తాపూర్)