
స్టైలిష్ పొలిటీషియన్స్..
బెంగళూరు: దక్షణాది రాష్ట్రాల రాజకీయ నాయకులు డ్రెస్‌కోడ్ ఏదీ అంటే తెల్ల ఖద్దరు చొక్కా, తెల్ల పంచె లేదా తెల్ల ప్యాంట్ అని ఠక్కున సమాధానం చెప్పేస్తారు. అంతలా ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయిన మన రాజకీయ నాయకుల డ్రెస్ కోడ్ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ ప్రముఖులు ఇక్కడి పర్యటనకు వచ్చినపుడు, ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమాలకు మన రాజకీయ నాయకులు సహజశైలి వస్త్రధారణకు భిన్నంగా సూట్లు, కోట్లు ధరిస్తూ మార్పును స్వాగతిస్తుంటారు.
ఎప్పుడూ తెల్ల చొక్కా, తెల్ల పంచెలో కనిపించే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల దుబాయ్ పర్యటనకు వెళ్తున్నప్పుడు సూట్ ధరించి కొత్త లుక్‌లో కనిపించారు. సీఎం సిద్ధరామయ్య మేకోవర్‌పై సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల్లో ఆసక్తికర చర్చలు జరిగాయి. సీఎం సిద్ధరామయ్య సూట్‌లో కంటె పంచెకట్టులోని హుందాగా ఉంటారని అధికశాతం ప్రజలు అభిప్రాయపడ్డారు.
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్రమంత్రి సదానందగౌడ, జగదీశ్‌శెట్టర్, ఎస్.ఎం.కృష్ణ, ధర్మసింగ్, అంబరీశ్, ప్రియాంక్ ఖర్గె, దినేశ్ గుండూరావ్ తదితర నాయకులు తమ సహజశైలి వస్త్రధారణకు భిన్నంగా సూట్లు, కోట్‌లు ధరించి అప్పుడప్పుడూ స్టైలిష్‌లుక్‌లో కనిపించినవారే. అందరికంటే ముఖ్యంగా గ్లామరస్ సూట్‌లో దర్శనమిచ్చింది ఎస్.బంగారప్ప. ‘కొన్ని ముఖ్యమయిన సమావేశాలు, విదేశీ పర్యటనల్లో రాజకీయ నాయకులు సూట్, కోట్‌లను ధరించడం తప్పనిసరి. రాష్ట్ర నాయకుల్లో ఎన్.ఏ.హ్యారిస్, దినేశ్ గుండూరావ్‌లకు సూట్‌లు బాగా నప్పుతాయి’.