
పోర్న్ డీవీడీలకు భలే గిరాకి
అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం ఎంతమందిని సంస్కరించిందోగానీ డీవీడీ ప్యాపారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.
న్యూఢిల్లీ: అశ్లీల వెబ్ సైట్లపై నిషేధం ఎంతమందిని సంస్కరించిందోగానీ డీవీడీ ప్యాపారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పోర్న్ డీవీడీల ధరలు ఒక్కసారిగా చుక్కలనంటాయి. సోమవారం 100 రూపాయలుగా ఉన్న ఓ హెచ్డీ పోర్న్ డీవీడీ ధర బుధవారం నాటికి 300 రూపాయలకు ఎగబాకింది.
ఢిల్లీలోని డీవీడీల అమ్మకాలకు ప్రసిద్ధి చెందిన లజపత్ నగర్, పాలిక బజార్, పహర్ గంజ్ మార్కెట్లలో 10- 12 వీడియో క్లిప్స్ ఉండే 8 జీబీ డీవీడీ ధర రూ. 300 దాటింది. కోల్కతాలోనూ సీడీల ధరలు 30 శాతం పెరిగాయి. ప్రఖ్యాత పార్క్ సర్కస్ మార్కెట్లో నిన్నటివరకు 20 రూపాయలకు అమ్ముడయిన పోర్న్ సీడీ.. నేడు 40 రూపాయలు పలుకుతోంది. 'మొబైల్ ఫోన్లోకి ఎంఎంఎస్ క్లిప్స్ డౌన్లోడ్ చేయించుకునే వరకు నా జేబు ఖాళీ అయింది' అని ఓ కస్టమర్ అన్నాడు. కోల్కతాలో ఇంగ్లీష్ డీవీడీలు అధికంగా లభించే గరియాహత్, రష్ బెహారీ అవెన్యూల్లోనైతే ఒక్కో సీడీని రూ. 60కి విక్రయిస్తున్నారు వ్యాపారులు.
ఇక ఉత్తరప్రదేశ్ లోనైతే పోర్న్ డీవీడీల ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. నాకా పరిధిలోని ప్రీత్, అంబర్ మార్కెట్లు.. హజ్రత్గంజ్లోని నాజా మార్కెట్లలో వ్యాపారులు నోటికి ఎంతొస్తే అంత ధర చెప్పి డీవీడీలు అమ్ముతున్నారు. '1995 నుంచి ఈ వ్యాపారంలో కొనసాగుతున్న పోర్న్ డీవీడీల కోసం జనం ఇంతలా ఎగబడటం ఇప్పుడే చూస్తున్నా. రాయ్బరేలీ, బస్తీ, ఫరీదాబాద్, బారబంకి, సీతాపూర్ జిల్లాల నుంచి వచ్చేవాళ్లు నా దగ్గరే డీవీడీలు కొంటారు' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యాపారి తెలిపాడు.
టెక్ సిటీ బెంగళూరులోనైతే డీవీడీల కంటే వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్) అనూహ్యంగా పుంజుకుంది. వీపీఎస్ ద్వారా నిషేధిత సైట్లలోకి అక్రమంగా ప్రవేశించే వీలుండటమే ఇందుకు కారణం. 'నిజం చెప్పాలంటే పెన్డ్రైవ్స్ వచ్చిన తర్వాత డీవీడీల అమ్మకాలు అంతంతమాత్రంగా ఉండేవి. పోర్న్ వెబ్సైట్లను ప్రభుత్వం నిషేధించిన తర్వాత మళ్లీ మాకు కస్టమర్లు పెరిగారు. అందులోనూ పోర్న్ డీవీడీలకు మరింత క్రేజ్ పెరిగింది' అని చెప్పాడు బెంగళూరులోని నేషనల్ మార్కెట్ లో ఓ షాప్ ఓనర్.
ఇక్కడ మరో సంగతేమంటే.. పోర్న్ సీడీలు, డీవీడీల మీద ఎలాంటి సమాచారం రాసిఉండదు. కనీసం అందులో ఎన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయో కూడా కస్టమర్ తెలుసుకునే అవకాశమే ఉండదు. చచ్చినట్లు కొనుక్కుని ఇంటికి వెళ్లాకగానీ చూసుకోలేడు. అయితే 'కస్టమర్ కొద్దిగా డీటెల్స్ చెప్పగలిగితే అతని టేస్ట్కి దగ్గర్నో ఉండే డీవీడీలు ఇస్తాం' అని చెబుతున్నారు కొందరు వ్యాపారులు!