రాష్ట్రపతిని కలిసిన ప్రధాని
* ఉపరాష్ట్రపతితోనూ భేటీ
* పీఎంఓ సిబ్బందికి కితాబు
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలను గౌరవ పూర్వకంగా కలిశారు. వారితో భేటీలకు సంబంధించిన ఫొటోలను ట్వీటర్‌లో పోస్ట్ చేశారు. అలాగే, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, సిబ్బందితో సమావేశమై, సంవత్సరం పాటు వారు చేసిన కృషిని అభినందించారు. ‘టీమ్ పీఎంఓ’ అంటూ వారిని ప్రశంసించారు.
‘అధికారులు, సామాన్యులు ఒకేలా ఆలోచిస్తారన్నది నా అనుభవం. సరైన వాతావరణం కల్పిస్తే.. సామాన్యులకు ఉపయోగపడేలా అధికారులు పనిచేస్తారు’ అని మోదీ పేర్కొన్నట్లు పీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పీఎంఓలో తీసుకువచ్చిన సంస్కరణలు, మార్పులను అధికారులు మోదీకి వివరించారని అందులో పేర్కొన్నారు.
అలాగే, సాయంత్రం కాసేపు బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో గడిపిన మోదీ.. అక్కడ పనిచేస్తున్న కార్యకర్తలతో ఫొటోలు దిగారు. తాను పార్టీ ఆఫీస్ బేరర్‌గాఉన్న సమయంలో తనతో పాటు పనిచేసిన వారి గురించి ఆరా తీశారు. మోదీతో పాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ ఉన్నారు. అనంతరం అమిత్ షా, ఇతర నాయకులతో సమావేశమయ్యారు.