
‘ప్రాణహిత- చేవెళ్ల’పై కాంగ్రెస్ పట్టు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పుపై రంగారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశం అట్టుడికిపోయింది. గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు రాకుండా మెదక్ వరకే పరిమితం చేయడాన్ని ప్రశ్నిస్తూ విపక్ష కాంగ్రెస్ సభ్యులు పోడియం ముందు బైఠాయించడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. పాత నమూనాను యథాతథంగా కొనసాగించేలా తీర్మానం చేయాలని పట్టుబట్టడం.. ఒకానొక దశలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సభ్యులు పోటాపోటీగా నిలదీసుకుంటూ తోపులాటకు దిగడంతో సభ అదుపుతప్పింది.
శనివారం చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత ఈ అం శాన్ని లేవనెత్తిన ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి.. ప్రాణహిత ప్రాజెక్టు మళ్లింపు ప్రకటనపై అధికారపక్షాన్ని గట్టిగా నిలదీశారు. దాదాపు రూ. వెయ్యి కోట్ల పనులు కూడా పూర్తిచేసుకున్న ప్రాజెక్టును కుదించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నందున.. ప్రస్తుత డిజైన్‌నే కొనసాగించేలా తీర్మానం చేయాలని పట్టుబట్టారు.
దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టితో బీడువారిన రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశార న్నా రు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును మెదక్ వరకు పరిమితం చేయడంతో తీరని అన్యా యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడేలా ప్రాజెక్టు మళ్లింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా తీర్మానం చేయాలని పట్టుబట్టారు. రామ్మోహన్‌రెడ్డికి బాసటగా కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు దూసుకొచ్చారు.
ఆఖరికి పోలీసులు రంగప్రవేశం చేసి సభ్యులను అరెస్టు చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు నుంచి జిల్లాను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు జిల్లా పరిషత్‌ను ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. వీరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అడ్డుకున్న అధికారపక్షం
ప్రాణహిత డి జైన్ మార్పుపై విపక్ష సభ్యుల ఆం దోళనను విరమింపజేసేందుకు రవాణా మం త్రి మహేందర్‌రెడ్డి, చైర్‌పర్సన్ సునీత, కలెక్టర్ రఘునందన్‌రావు పలుమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ పట్టు వీడలేదు. తీర్మానం చేయాల్సిందేనని గట్టిగా నినాదాలివ్వడమేకాకుండా.. మంత్రితో వాగ్వావాదానికి దిగారు. ఈ క్రమంలోనే సమావేశాన్ని వాయిదా వేసి బయటకు వెళ్లిన మంత్రిని కాంగ్రెస్ శ్రేణులు ఘెరావ్ చేశాయి. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనకు టీడీపీ, బీజేపీలు కూడా సంఘీభావం ప్రకటించడం గమనార్హం.
మేంవినం: మంత్రి మహేందర్‌రెడ్డి
‘కాంగ్రెస్ చెబితే.. మేం వినే ప్రసక్తేలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేకుండా గందరగోళం సృష్టించడం మంచి పద్ధతికాదు. రాజకీయం చేయాలని చూస్తే బాగుండదు. మేం కూడా జనంలోకి వెళ్లగలం. ప్రాజెక్టు నమూనా మార్పుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.’ అని అన్నా రు. అంతకుముందు ఈ అంశంపై మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ 60 శాతం పనులు పూర్తిచేసుకున్న ప్రాజెక్టును ఆపడం సరికాదన్నారు. ప్రాణహితపై స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం అపోహలకు తావిస్తోందని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు.
కొత్త నినాదం ‘జై దక్షిణ తెలంగాణ’
కాగా, దక్షిణ తెలంగాణ జిల్లాల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు శనివారం రంగారెడ్డి జెడ్పీ సమావేశంలో ‘జై దక్షిణ తెలంగాణ’ అని నినదించారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ కోసం రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని నినాదాలు చేశారు.