
హోటల్ వ్యాపారంలోకి హీరోయిన్
చెన్నై : సినిమా హీరోలు చాలా మంది ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం అన్నది సాధారణ విషయం. ఇప్పుడు హీరోయిన్లు కూడా ఆ రంగం వైపు మొగ్గు చూపుతుండడం విశేషం. ఇప్పటికే నటి త్రిష, రాధ వంటి వారు హోటల్ వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. తాజాగా నటి ప్రణీత హోటల్ వ్యాపారంలో భాగస్వామిగా మారారు.
ఈ కన్నడ బ్యూటీ తమిళంలో శకుని తదితర చిత్రాల్లో నటించారు. అలాగే తెలుగులో అత్తారింటికి దారేది వంటి కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. అలాగే కన్నడంలోనూ హీరోయిన్‌గా నటించారు. అయినా ఎందుకనో ఏ భాషలోనూ అంతగా బిజీ కాలేకపోయారు. అవకాశాలు అడపా దడపానే అదీ సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి.
అందువల్లో ఏమో సినిమాను నమ్ముకుంటే లాభం లేదనుకుని ఇతరత్రా ఆదాయంపై ప్రణీత దృష్టి సారించారు. అలా ఆమెను ఆకర్షించిన వ్యాపారం హోటల్ రంగం. బెంగళూర్‌లో ఒక ప్రముఖ హోటల్‌కు ప్రణీత భాగస్వామి అయ్యారు. ప్రణీత తల్లిదండ్రులిద్దరూ వైద్యులు. ప్రణీత షూటింగ్‌కు వెళ్తే హోటల్ వ్యాపారాన్ని ఆమె తల్లిదండ్రులు చూసుకుంటారట. ఇలా ప్రణీత రెండు చేతులా సంపాదిస్తున్నారన్న మాట.