ఆ పిల్లలకు ఐఐటీ ఫీజులు మాఫీ
కూలీల పిల్లలు ఐఐటీలో ప్రవేశం దక్కించుకున్నా, ఫీజులు కట్టలేని దుస్థితి ఉండటంపై మోదీ సర్కారులోని మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. వాళ్లకు అడ్మిషన్ ఫీజును మొత్తం రద్దు చేయడంతో పాటు.. తర్వాత కావల్సిన సెమిస్టర్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, మెస్ ఫీజులు అన్నింటికీ స్కాలర్షిప్ కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్ గఢ్ జిల్లా రెహువా లాల్ గంజ్ గ్రామస్తుడైన ధర్మరాజ్ సరోజ్ కుమారులైన రాజు, బ్రిజేష్ ఐఐటీలో 167, 410 ర్యాంకులు తెచ్చుకున్నారు.
అయితే, వాళ్లకు ఒక్కొక్కళ్లకు అడ్మిషన్ ఫీజు రూ. 30 వేలు, తొలి సెమిస్టర్ ఫీజు రూ. 20 వేల చొప్పున ఇద్దరికీ కలిపి లక్ష రూపాయలు ముందే కట్టాల్సి వస్తోంది. ఈ దుస్థితిని మీడియా విస్తృతంగా వెలుగులోకి తెచ్చింది. దీంతో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించి సోదరులిద్దరికీ ఫీజులు మాఫీ చేశారు. అదే విషయాన్ని ఆ కుటుంబానికి కూడా ఆమె తెలియజేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. దాంతో ఆ సరస్వతీ పుత్రులకు లక్ష్మీకటాక్షం కూడా దొరికినట్లయింది. వాళ్ల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి.
@ratigirl informed family dat registration fees will b waived off n wil b eligible for scholarships dat cover tuition, mess n other charges
— Smriti Z Irani (@smritiirani) June 20, 2015