ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష
బాగా చదువుకుని నర్సు కావాలని ఉంది
బంధువుల ఇంటికి మాత్రం వెళ్లను
ఎవరైనా సాయమందించాలని ప్రత్యూష విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష క్రమంగా కోలుకుంటోంది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బుధవారం జనరల్ వార్డుకు తరలించారు. ఎల్‌బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆమె ఆరోగ్యపరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. కాగా, తను ఇప్పటికే నర్సింగ్ పూర్తి చేశానని, నర్సు కావాలని ఉందని, ఎవరైనా సాయమందిస్తే ఉన్నత చదువులు చదువుకుంటానని ప్రత్యూష పేర్కొంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక బంధువుల ఇంటికి వెళ్లనని, స్టేట్‌హోంలో ఉంటానంది.
బతికి బయటపడతాననుకోలేదు..
తన పిన్ని వేధింపులకు గురిచేసిన వైనాన్ని ప్రత్యూష ‘సాక్షి’కి వివరించింది. ఆమె చేతిలో నుంచి బతికి బయటపడతాననుకోలేదని ఆమె పేర్కొంది. ‘2010లో అమ్మ చనిపోయినప్పటి నుంచి స్టేట్‌హోంలో ఉంటూ పదోతరగతి, వొకేషనల్ పూర్తి చేశాను. ఆ తర్వాత నాన్న వచ్చి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మా పిన్ని ప్రతి రోజూ చిత్రహింసలు పెట్టేది. రోజూ కళ్లు, నోటిలో ఫినాయిల్, యాసిడ్, హిట్, ఉప్పు కుక్కేది. మింగకపోతే ఇనుప రాడ్లతో కొట్టేది’ అని వాపోయింది. తనకు మతిస్థిమితం లేదని ముద్ర వేసి వేధించేదని చెప్పింది. బంధువులు వస్తే తనను గదిలో బంధించి కాలేజీకి వెళ్లిందని చెప్పేదని పేర్కొంది. ఒకట్రెండు సార్లు తప్పిం చుకునే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు తీసుకెళ్లి ఇంట్లో అప్పగించేవారని, దీంతో తన పిన్ని మరింత చిత్రహింసలకు గురిచేసేదని చెప్పింది.