కేసీఆర్ ఇంటికి ప్రత్యూష
హైదరాబాద్: పినతల్లి, తండ్రి చేతిలో చిత్రహింసల అనుభవించిన ప్రత్యూష తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇంటికి వెళ్లనుంది. ఆమెను కేసీఆర్ ఇంటికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది.
బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ప్రత్యూషను హైకోర్టులో హాజరుపరిచారు. చీఫ్ జస్టిస్ 25 నిమిషాల పాటు ప్రత్యూషతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రత్యూషను ఎక్కడ ఉంచాలన్న విషయం నిర్ణయిద్దామని న్యాయస్థానం పేర్కొంది. ప్రత్యూషను ఆదుకునేందుకు ముందుకొచ్చిన సీఎం కేసీఆర్ను హైకోర్టు అభినందించింది. సీఎం కలుగ చేసుకోవడం వల్ల ప్రత్యూష లాంటి బాధితులెందరికో భరోసానిస్తుందని న్యాయస్థానం ప్రశంసించింది.
ఇటీవల ప్రత్యూష చికిత్స పొందుతున్నఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ దంపతులు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యూషకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ప్రత్యూషను చదివించడంతో పాటు సొంత ఖర్చులతో ఇల్లు కట్టించి, పెళ్లి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రత్యూష బాధ్యతలను తాను తీసుకుంటున్నట్టు చెప్పారు.