
ఇవి చరిత్రాత్మక సమావేశాలు
- తొలిసారి సాధారణ బడ్జెట్‌లో ‘రైల్వే’ విలీనం
- ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్’ నినాదంతో ప్రభుత్వం ముందడుగు
- పీడిత వర్గాల అభ్యున్నతికి విశేషకృషి
- బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన రాష్ట్రపతి
- ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రణబ్ ముఖర్జీ
- రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: అనేక కారణాల రీత్యా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు చరిత్రాత్మకవైనవని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ బడ్జెట్ మావేశాలను ప్రారంభించిన ఆయన.. దశాబ్దాల సంప్రదాయానికి విరుద్ధంగా రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సబ్‌కా సాత్ - సబ్‌కా వికాస్(సమిష్టిగా సర్వతోముఖాభివృద్ధి) నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని చెప్పారు. పీడిత, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలోనే గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
అంతకుముందు, బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు పార్లమెంట్ భవనానికి చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్(ఉపరాష్ట్రపతి) హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తదితరులు ప్రణబ్‌కు వందనం చేసి సభలోపలికి తీసుకెళ్లారు. జాతీయగీతాలాపన తర్వాత రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రేపు(బుధవారం ) ఉదయం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.