భారత్-పాక్ ఐక్యతకు చిహ్నానివి
‘భారత పుత్రిక’ గీతతో రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ: ‘భారత పుత్రిక’ గీత (23) మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వేర్వేరుగా కలుసుకుంది. ఈది ఫౌండేషన్ ప్రతినిధులతో కలసి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న గీతను ప్రణబ్ ఆశీర్వదించారు. ఆమెను భారత్-పాక్ పుత్రికగా, ఇరు దేశాల ఐక్యతకు చిహ్నంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఈది ఫౌండేషన్ చేస్తున్న మంచిపనులను ఆయన అభినందించారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో గీత అంతకుముందు కలుసుకోగా అన్ని రకాలుగా ఆమెకు అవసరమైన సాయం చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
సంజ్ఞల భాష దుబాసీ సాయంతో కేజ్రీవాల్ గీతతో సుమారు 20 నిమిషాలు మాట్లాడారు. మరోవైపు గీత తల్లిదండ్రులం తామేనంటూ యూపీలోని రాంపూర్‌కు చెందిన అనారాదేవి, రామ్‌రాజ్‌లు గీతను కలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని...డీఎన్‌ఏ పరీక్షకు సైతం తాము సిద్ధమని అనారాదేవి తెలిపింది. కాగా, గీతను అధికారులు మంగళవారం ఇండోర్‌లోని బధిరుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. తన అసలైన తల్లిదండ్రులెవరో తేలేవరకు ఆమె అక్కడే ఉండనుంది.
రూ. కోటి విరాళాన్ని తిరస్కరించిన ఈది ఫౌండేషన్: గీత బాగోగులు చూసుకున్నందుకు భారత ప్రధాని మోదీ ప్రకటించిన రూ. కోటి విరాళాన్ని పాక్ స్వచ్ఛంద సంస్థ ఈది ఫౌండేషన్ మంగళవారం తిరస్కరించింది. మోదీ ప్రకటనపట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈది కృతజ్ఞత తెలుపుతూనే ఆర్థికసాయాన్ని సున్నితంగా తిరస్కరించారని సంస్థ ప్రతినిధి అన్వర్ తెలిపారు.