
పదవి ఔన్నత్యం కాపాడుతా
- రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్
- ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాను
- మద్దతు పలికిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు
- తెలంగాణకు మీ ఆశీర్వాదం కావాలి: కేసీఆర్
- కోవింద్‌కు ఘన స్వాగతం.. నగరం నిండా స్వాగత తోరణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పదవికి ఉన్న గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుతానని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాష్ట్రపతిగా రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. బీజేపీతో తనకున్న రాజకీయ అనుబంధం గతమని, ఇప్పుడు తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానని తెలిపారు. బిహార్ గవర్నర్ కాకముందే బీజేపీ సభ్యత్వం వదులుకున్నానని అన్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరేందుకు హైదరాబాద్ వచ్చిన కోవింద్ మంగళవారం జలవిహార్‌లో టీఆర్‌ఎస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమం త్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్‌సభలో పార్టీ పక్ష నేత జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అతిథులుగా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. కోవింద్‌ను వెంకయ్య నాయుడు సభకు పరిచయం చేసి ప్రసంగించగా కేకే ప్రారంభోపన్యాసం చేశారు.
దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా..
ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ.. తనను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే సీఎం కేసీఆర్ మద్దతు పలికారని గుర్తుచేశారు. ‘‘నేను రెండు విషయాలకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటి నా గౌరవార్థం హైదరాబాద్‌లో స్వాగత హోర్డింగులు ఏర్పాటు చేశారు. సీఎం నాకు మరో గౌరవం ఇచ్చారు. హిందీ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చానని ఆయన నా కోసం హిందీలో ప్రసంగించారు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. రాష్ట్రపతి పదవి ఈ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, ఏపీజే అబ్దుల్ కలాం, జాకీర్ హుస్సేన్, నీలం సంజీవరెడ్డి వీళ్లంతా ఆ పదవికి వన్నె తెచ్చారు. ప్రపంచంలో మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ఎంత ప్రాధాన్యం ఉందో తెలుసు. మనదేశానికి రాజ్యాంగం చాలా ముఖ్యం. మనం అందరం దానికి కట్టుబడి ఉండాలి. రాష్ట్రపతి త్రివిధ దళాలకు అధిపతి. దేశ సరిహద్దుల పరిరక్షణే మనకు అన్నింటికన్నా ప్రధానం. బిహార్ గవర్నర్‌గా రాజకీయాలకు అతీతంగా పనిచేశాను. బిహార్‌లో ప్రతి పౌరుడిని ఎలాంటి వివక్ష చూపకుండా, సమానంగా చూశా. రాష్ట్రపతిగానూ అదే బాధ్యత నిర్వర్తిస్తా. ప్రస్తుతానికి నేను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదు. కులం, భాష, ప్రాంతీయ, భౌగోళిక పరిస్థితులకు అతీతంగా అన్నిరంగాల్లోనూ దేశ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా. యువత ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చేందుకు నా వంతు కృషి చేస్తా. నూతన విద్యావిధానం అభివృద్ధి కోసం పని చేస్తా. 2022 లోగా నవీన భారతాన్ని సాధించాలని కృషి చేస్తున్న ప్రధాని మోదీకి నా అభినందనలు. ప్రధాని నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏకు, ఎన్డీ యేతర పార్టీలకు, ముఖ్యంగా టీఆర్‌ఎస్‌కు కృతజ్ఞతలు. నా నామినేషన్ సమయంలో మద్దతు తెలిపేందుకు సీఎం కేసీఆర్ హాజరు కావడం సంతోషం. రాష్ట్రపతి పదవిని సమర్థంగా నిర్వహిస్తా.. నా అభ్యర్థిత్వానికి మద్దతివ్వండి..’’ అని కోవింద్ కోరారు.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు: వెంకయ్య
అన్ని విధాలా అర్హత ఉన్నందునే రామ్‌నాథ్ కోవిం ద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించామని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. సంపూర్ణ మద్దతు ప్రక టించిన కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తరఫు న కృతజ్ఞతలు తెలిపారు. రామ్‌నాథ్‌కు మెజార్టీ ఉందని తెలిసినా కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టిందని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉందని వ్యాఖ్యానించారు.
భారీ మెజారిటీతో గెలుస్తారు: కేసీఆర్
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోం దని, రాష్ట్రానికి కోవింద్ ఆశీర్వాదం కావాలని సీఎం కేసీఆర్ కోరారు. రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థి త్వాన్ని తమ పార్టీ సంపూర్ణంగా బలపరుస్తోందని, కోవింద్ భారీ మెజారిటీతో గెలవడం తథ్యమని అన్నారు. ‘‘సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజాస్వామ్య యుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మా ముందు ఎన్నో సమస్య లుండేవి. విద్యుత్ కొరత పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. చాలా తక్కు వ సమయంలోనే దేశంలోని అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణను నిలిపాం. 17.8 శాతం వార్షి క ఆదాయ వృద్ధి రేటుతో భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా కొనసాగు తోంది. సంక్షేమంలోనూ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది’’ అని పేర్కొన్నారు. దేశ అత్యు న్నత పదవికి రామ్‌నాథ్ పేరును టీఆర్‌ఎస్ తర ఫున సమర్థించడం గర్వంగా ఉందన్నారు. ఆయన రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రగతికి రామ్‌నాథ్ ఆశీర్వాదం, మార్గదర్శకత్వం కోరు కుంటున్నామన్నారు.
సాదర స్వాగతం.. ఘనంగా వీడ్కోలు
రామ్‌నాథ్ కోవింద్‌కు ఉదయం బేగం పేట విమానాశ్రయంలో టీఆర్‌ఎస్ తరఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్, ఈటల, నాయిని ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు స్వాగత తోర ణాలు ఏర్పాటు చేశారు. జలవిహార్‌లో తెలం గాణ వంటకాలతో కోవింద్‌కు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ సహా మంత్రులంతా విమానాశ్రయం దాకా వెళ్లి కోవింద్‌కు వీడ్కోలు పలికారు. విమానాశ్రయం వద్ద సీఎం మంత్రులందరినీ కోవింద్‌కు పరిచయం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలతో కోవింద్ భేటీ
రాజాసింగ్ గైర్హాజరు.. వెంకయ్య అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం హైదరాబా ద్‌లో రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, పలువురు రాష్ట్ర నేతలు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలు జరిగే విధానం, సాంకేతికాంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితరాల గురించి వెంకయ్య, మురళీధర్‌రావు వివరించా రు. భేటీకి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గైర్హాజరవడంపై వెంకయ్య ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేయేనా, కాదా? ఇంత ముఖ్యమైన సమావేశానికి రాలేదేం? పార్టీలో ఏం జరుగుతోంది?’’అని కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డిలను ప్రశ్నించారు. భేటీ గురించి రాజాసింగ్‌కు సమాచారమివ్వగా..ఇంట్లో ఫంక్ష న్ ఉందని చెప్పారని లక్ష్మణ్ వివరించారు. దీనిపై రాజాసింగ్‌ను సంప్రదించగా, సమావేశానికి ఆహ్వానమేదీ తనకందలేదన్నారు.