సోనియాతో ఏచూరి కీలక చర్చలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్షాలు ఒక్కతాటిపై వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జేడీయూ, సీపీఎం ముందడుగు వేశాయి. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని పోటీ పెట్టడంపై సోనియాతో ఏచూరి చర్చించినట్టు సమాచారం. ఉమ్మడి అభ్యర్థిని నిలబడితే మద్దతు ఇవ్వాలని సీపీఎం పొలిట్ బ్యూరో ఇంతకుముందే నిర్ణయించింది.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ కూడా గురువారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలన్నింటీనీ ఏకం చేసే అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని బరిలో దించటం విషయంలో ముందుండి నడపాలని కూడా సోనియాను నితీశ్ కోరినట్లు సమాచారం.