అన్యాయం జరగనివ్వం : ప్రధాని | Prime minister assures of justice to employees | Sakshi
Sakshi News home page

అన్యాయం జరగనివ్వం : ప్రధాని

Published Wed, Aug 28 2013 3:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

అన్యాయం జరగనివ్వం : ప్రధాని

అన్యాయం జరగనివ్వం : ప్రధాని

ఏపీఎన్జీవో, ఇతర సంఘాల నేతలతో ప్రధాని
ఏ ప్రాంతానికీ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందన్న మన్మోహన్‌సింగ్
విభజనతో ఎదురయ్యే సమస్యలు విన్నవించిన సంఘాల ప్రతినిధులు
ప్రధాని దృష్టికి హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు
అప్పుడే ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారంటూ వివరణ
రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని వినతి
ప్రధాని నుంచి ఎలాంటి హామీ లభించలేదన్న అశోక్‌బాబు

 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో ఎదురయ్యే సమస్యలను పరిశీలించి ఏ ప్రాంతానికీ ఎలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అంగీకరించారు. పార్టీ పరంగా తీసుకొన్న నిర్ణయాన్ని మార్చుకోలేకపోయినా ప్రభుత్వ పరంగా ఏ వర్గానికీ, ప్రాంతానికీ అన్యాయం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఏపీఎన్జీవోలు, టీచర్లు, ఆర్టీసీ, మునిసిపల్ ఉద్యోగ సంఘాలు, విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలోని కార్యాలయంలో ప్రధానితో సమావేశమయ్యారు. సుమారు 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో.. రాష్ట్రాన్ని విభజిస్తే కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలకు ఎదురయ్యే సమస్యలను, ఇబ్బందులను వారాయనకు వివరించారు. తెలంగాణ నిర్ణయం వెలువడిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులపై హింసాయుత దాడులు ప్రారంభమైన విషయాన్ని మన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ స్థాయిలో ప్రక్రియ ప్రారంభం కాకముందే తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని, తమ సంఘాల సమావేశాలను నిర్వహించుకునే స్వేచ్ఛను కూడా కాలరాస్తున్నారని తెలిపారు.
 
  తెలంగాణ ఉద్యమం పూర్తిగా రాజకీయవేత్తలు తమ స్వార్థం కోసం సృష్టించి, ప్రజలను రెచ్చగొట్టి చేసిందేనని ఆరోపించారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల కంటే అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతం ఎంతో ఎక్కువగా అభిదృద్ధి చెందిందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విస్పష్టంగా తేల్చిచెప్పిన తర్వాత కూడా సెంటిమెంట్ పేరుతో తొలి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేస్తారని వారు ప్రధానిని ప్రశ్నించా రు. రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడకుండా తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించి రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడినప్పుడు ఆంధ్ర ఉద్యోగులకు ఎదురైన సీనియారిటీ, పింఛను వంటి తీవ్రమైన సమస్యల పరిష్కారానికి 15 ఏళ్లకు పైగా సమయం పట్టడాన్ని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. విభజన నిర్ణయాన్ని అమలు చేస్తే వేలాదిమంది ప్రభుత్వోద్యోగులు తమ ఆస్తులను, హైదరాబాద్‌తో పెంచుకున్న అనుబంధాన్ని వదులుకొని వెళ్లిపోవాల్సి వస్తుందని తెలిపారు.
 
 సమ్మె విరమించి చర్చించమన్నారు: అశోక్‌బాబు
  రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించే విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఎలాంటి స్పష్టమైన హామీ లభించలేదని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పా రు. ప్రధానితో సమావేశానంతరం ఆయన విజయ్‌చౌక్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆందోళనలు విరమించి కమిటీతో చర్చించాలని ప్రధాని సూచించి నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా, టీఆర్‌ఎస్ పార్టీ అడ్డుకుంటున్న విషయం ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని, మీకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు.
 
 ప్రధానితో పాటు వివిధ జాతీయ రాజకీయ పార్టీల నాయకులను కూడా కలుసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరామన్నారు. సోమ, మంగళవారాల్లో బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ, జనతాదళ్(యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్, అన్నాడీఎంకే నేత తంబిదురై, తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ, సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్‌యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం నేత సీతారాం యేచూరి, డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు తదితరులకు సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజాందోళనను వివరించామని అశోక్‌బాబు తెలిపారు. ఆంటోనీ కమిటీతో భేటీ అయ్యే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించదలచిన భారీ ర్యాలీకి హాజరుకావాల్సిందిగా రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలను, కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జె.డి.శీలం, ఎంపీలు కనుమూరి బాపిరాజు, జి.వి.హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, బొత్స ఝాన్సీ ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు.    
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement