
‘తాపి’ ప్రాజెక్టుతో నవశకం
తుర్క్‌మెనిస్తాన్ పర్యటనలో ప్రధాని మోదీ
తుర్క్‌మెనిస్తాన్-అఫ్గాన్-పాక్-భారత్ ద్వారా గ్యాస్‌లైన్ నిర్మాణ్వాన్ని త్వరితంగా పూర్తి చేయాలి
ఈ దేశంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ సిద్ధం
తుర్క్‌మెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బంగులితో మోదీ భేటీ
పర్యాటకం, రక్షణ సహా ఏడు ఒప్పందాలపై సంతకాలు
ఆష్గాబట్(తుర్క్‌మెనిస్తాన్): తుర్క్‌మెనిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారత్‌కు సహజ వాయువు అందించే పైప్‌లైన్ నిర్మాణం(తాపి ప్రాజెక్టు) త్వరగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు తుర్క్‌మెనిస్తాన్, భారత్ సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందన్నారు. ఇంధన రంగంలో తుర్క్‌మెనిస్తాన్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తుర్క్‌మెనిస్తాన్‌లో పర్యటిస్తున్న మోదీ శనివారం దేశ అధ్యక్షుడు గుర్బంగులి బెర్దిముఖమెదోవ్‌తో భేటీ అయ్యారు. రూ.63 వేల కోట్ల విలువైన(10 బిలియన్ డాలర్లు) తాపి( తుర్క్‌మెనిస్తాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇండియా) ప్రాజెక్టుతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, ఎరువులు సహా పలు అంశాలపై ఇరుదేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.
శాంతితోనే ఉమ్మడి ప్రయోజనాలు
సుస్థిర అఫ్గానిస్తాన్‌కు కట్టుబడి ఉన్నామని మోదీ, బెర్దిముఖమెదోవ్ ఉద్ఘాటించారు. ఉగ్రవాదమే అతిపెద్ద సవాలని మోదీ అన్నారు. ‘అఫ్గాన్, మధ్య ఆసియా సుస్థిరతతో ప్రశాంతంగా ఉన్నప్పుడే ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరతాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం. తాపి ప్రాజెక్టు ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇరాన్ మీదుగా సముద్రం-భూమార్గం ద్వారా పైప్‌లైన్ వేయడంతోపాటు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయని బెర్దిముఖమెదోవ్‌తో అన్నారు. 1,800 కి.మీ.లకు పైగా ఉన్న ఈ మార్గం ద్వారా తుర్క్‌మెనిస్తాన్‌లోని గాల్కినిష్ చమురుక్షేత్రం(ఇక్కడ 16 ట్రిలియన్ ఘనపుటడుగుల చమురు నిల్వలున్నాయి) నుంచి అఫ్గాన్, పాక్, భారత్‌కు ఏడాదికి 3.2 బిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ సరఫరా చేయాలన్నది ప్రణాళిక. 2018 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇరాన్ ద్వారా తుర్క్‌మెనిస్తాన్‌కు రవాణా మార్గం పూర్తి చేసేందుకూ ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. దాంతోపాటు ప్రతిపాదిత కజకిస్తాన్- తుర్క్‌మెనిస్తాన్-ఇరాన్ రైలు మార్గం కూడా ఈ దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందన్నారు. మోదీ, బెర్దిముఖమెదోవ్ చర్చల తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తాపి ప్రాజెక్టును సత్వరం పూర్తిచేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 1 కల్లా కన్సార్షియం నేతల ఎంపికను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తుర్క్‌మెనిస్తాన్‌లో భారత్ యూరియా ఉత్పత్తి కేంద్రం ప్రారంభించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయన్నారు.
గాంధీ ఆశయాలతోనే ఉగ్రవాదానికి చెక్
తుర్క్‌మెనిస్తాన్ రాజధాని అష్గాబట్‌లో సంప్రదాయ వైద్యం, యోగా కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. తర్వాత అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉగ్రవాదం, పర్యావరణ సమస్యలే ప్రపంచం ముందున్న పెద్ద సవాళ్లని, మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు అనుసరించడమే వీటికి పరిష్కారమని చెప్పారు. యోగా అనేది భౌతిక వ్యాయామం కాదని, దేహం, మనస్సు, బుద్ధిని అనుసంధానించే ప్రక్రియ అని పేర్కొన్నారు. రష్యాలో బ్రిక్స్, ఎస్‌సీవో సదస్సుల్లో పాల్గొన్న అనంతరం మోదీ శుక్రవారం రాత్రి తుర్క్‌మెనిస్తాన్ చేరుకున్నారు.