Turkmenistan
-
Gates of Hell: నరకద్వారం...!
మధ్య ఆసియా దేశం తుర్కెమెనిస్తాన్లోని కారకూమ్ ఎడారి మధ్యలో ఉన్న అగ్ని జ్వాలల గొయ్యి ఇది. ‘దర్వాజా’గా పిలిచే ఈ ప్రాంతం వద్ద 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ జమానాలో సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టారు. ఫలితం లేక వదిలేశారు. తర్వాత అక్కడ ఇలా భారీ గొయ్యి ఏర్పడింది. మీథేన్ వాయువు విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో వలయాకారంలో ఇలా నిరంతరాయంగా మంటలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇది ప్రపంచ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ‘గేట్స్ ఆఫ్ హెల్’గా పిలిచే ఈ మండుతున్న గొయ్యికి అతి సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు. -
Tokyo Olympics: తుర్క్మెనిస్తాన్కు తొలిసారి పతకం
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో తుర్క్మెనిస్తాన్ ఎట్టకేలకు పతకాల బోణీ చేసింది. ‘టోక్యో’లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 59 కేజీల విభాగంలో పొలీనా గుర్యెవా 217 కేజీలు (స్నాచ్‌లో 96+క్లీన్ అండ్ జెర్క్‌లో 121) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయాక వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో (1996 అట్లాంటా నుంచి 2016 రియో ఒలింపిక్స్) తుర్క్మెనిస్తాన్ క్రీడాకారులు పోటీపడినా పతకం సాధించలేకపోయారు. -
ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది.. వచ్చేసింది
యాష్గబట్: కుక్కలకుండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదని..చాలామంది కుక్కలను ఎంతో అపురూపంగా పెంచుకుంటుంటారు. కుక్కలను అమితంగా ఇష్టపడే వారిలో తుర్క్మెనిస్థాన్ దేశాధినేత గుర్బంగులి బెర్డిముఖమెదోవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు సెంట్రల్ ఆసియాలో నివసించే ‘అలబాయ్’ అనే అరుదైన జాతి కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే ఈ జాతి కుక్కల స్మృతిగా శునక విగ్రహాన్ని బంగారంతో చేయించి దేశ రాజధాని యాష్గబట్‌లోని ప్రధాన కూడలిలో ప్రతిష్టించారు. తాజాగా ఆయన మరో అడుగు ముందుకేసి.. వార్తల్లో నిలిచారు. అలబాయ్ జాతి కుక్కల గౌరవార్థం ఏప్రిల్ చివరి ఆదివారాన్ని ‘నేషనల్ హాలిడే’గా ప్రకటించారు. ఇదేరోజు స్థానిక గుర్రపు జాతిని స్మరించుకోవడంతోపాటు అలబాయ్ డేను కూడా ఘనంగా జరుపుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అంతేగాక ఆరోజు డాగ్ బ్యూటీ అండ్ అగ్లీ కాంటెస్ట్‌లు నిర్వహిద్దామని గుర్బగులి పేర్కొన్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన జాతులలో ఒకటైన అలబాయ్ శునకం.. రష్యాతోపాటు, ఇతర మధ్య ఆసియా దేశాలలో కనిపిస్తుంది. తుర్క్మెనిస్థాన్లోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ శునకాలను, గుర్రాలను గౌరవించే సంప్రదాయం ఉంది. వాళ్లు తమ పశుసంపదతోపాటు వీటిని కూడా ప్రేమతో పెంచుకుంటారు. తుర్క్మెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బంగులి జాతి కుక్కల మీద ఓ పాట రాయడంతోపాటు ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. అంతేగాక 2017లో గుర్బంగులి అలబాయ్ శునకాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బహూకరించారు. -
తెలుసా... ఆట జరుగుతోంది అక్కడ!
అష్గబాట్ (తుర్క్మెనిస్తాన్): కరోనా వైరస్ చేతిలో ప్రపంచం విలవిల్లాడుతోంది. పోలీసులు, వైద్య, పారిశుధ్య వర్గాలు మినహా ఎవరూ రోడ్డుమీద తిరిగే పరిస్థితే లేదు. అన్ని దేశాల పరిస్థితి ఇంతే. కానీ తుర్క్మెనిస్తాన్లో మాత్రం ఫుట్‌బాల్ సీజన్ ఆదివారం పునఃప్రారంభమైంది. అది కూడా గప్‌చుప్‌గా కాదు... వేల ప్రేక్షకుల మధ్య కావడం అక్కడ మరో విశేషం. ఎందుకంటే తుర్క్మెనిస్తాన్లో కరోనా వైరస్ లేదు. కరోనా మహమ్మారి వ్యాపించని కొన్ని దేశాల్లో తుర్క్మెనిస్తాన్ కూడా ఉంది. ఈ దేశంలో ఒక్క కోవిడ్–19 కేసు లేకపోవడంతో లాక్డౌన్ విధించే పరిస్థితి రాలేదు. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు గత నెల అక్కడ 8 జట్లు తలపడే ఫుట్‌బాల్ లీగ్‌ను నిలిపివేశారు. టోర్నీని సస్పెండ్ చేసే సమయానికి మూడు మ్యాచ్‌లు జరిగాయి. నెల తర్వాత ఈవెంట్ మొదలవడంతో ప్రేక్షకులు ఉత్సాహం చూపుతున్నారు. -
‘తాపి’ పైప్‌లైన్ పనులకు శ్రీకారం
మేరీ(తుర్క్మెనిస్తాన్): తుర్క్మెనిస్తాన్, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఇండియా(టీఏపీఐ-తాపి) తాము చేపడుతున్న సహజవాయువు సరఫరా పైప్‌లైన్ పనులను మేరీలో ప్రారంభించాయి. తుర్క్మెనిస్తాన్ అధ్యక్షుడు బంగురే, అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీ, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, భారత ఉపరాష్ట్రపతి అన్సారీ పాల్గొని వెల్డింగ్ పనులకు ప్రారంభించారు. సహజవాయు సరఫరాకుగాను 1,800 కి.మీ. పైపులైన్‌ను రూ. 51 వేల కోట్లతో నిర్మించనున్నారు. 2019 డిసెంబరు కల్లా పూర్తిచేసి దీని ద్వారా రోజుకు 9 కోట్ల ఘనపు మీటర్ల సహజవాయువు (ఎంఎంఎస్ సీఎండీ) 30 ఏళ్లపాటు భారత్, పాక్, అఫ్ఘాన్లకు తుర్మెనిస్తాన్ పంపిణీ చేయనుంది. -
‘తాపి’ ప్రాజెక్టుతో నవశకం
తుర్క్మెనిస్తాన్ పర్యటనలో ప్రధాని మోదీ తుర్క్మెనిస్తాన్-అఫ్గాన్-పాక్-భారత్ ద్వారా గ్యాస్‌లైన్ నిర్మాణ్వాన్ని త్వరితంగా పూర్తి చేయాలి ఈ దేశంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ సిద్ధం తుర్క్మెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బంగులితో మోదీ భేటీ పర్యాటకం, రక్షణ సహా ఏడు ఒప్పందాలపై సంతకాలు ఆష్గాబట్(తుర్క్మెనిస్తాన్): తుర్క్మెనిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారత్‌కు సహజ వాయువు అందించే పైప్‌లైన్ నిర్మాణం(తాపి ప్రాజెక్టు) త్వరగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు తుర్క్మెనిస్తాన్, భారత్ సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందన్నారు. ఇంధన రంగంలో తుర్క్మెనిస్తాన్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తుర్క్మెనిస్తాన్లో పర్యటిస్తున్న మోదీ శనివారం దేశ అధ్యక్షుడు గుర్బంగులి బెర్దిముఖమెదోవ్తో భేటీ అయ్యారు. రూ.63 వేల కోట్ల విలువైన(10 బిలియన్ డాలర్లు) తాపి( తుర్క్మెనిస్తాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇండియా) ప్రాజెక్టుతోపాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, ఎరువులు సహా పలు అంశాలపై ఇరుదేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. శాంతితోనే ఉమ్మడి ప్రయోజనాలు సుస్థిర అఫ్గానిస్తాన్‌కు కట్టుబడి ఉన్నామని మోదీ, బెర్దిముఖమెదోవ్ ఉద్ఘాటించారు. ఉగ్రవాదమే అతిపెద్ద సవాలని మోదీ అన్నారు. ‘అఫ్గాన్, మధ్య ఆసియా సుస్థిరతతో ప్రశాంతంగా ఉన్నప్పుడే ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరతాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం. తాపి ప్రాజెక్టు ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇరాన్ మీదుగా సముద్రం-భూమార్గం ద్వారా పైప్‌లైన్ వేయడంతోపాటు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయని బెర్దిముఖమెదోవ్తో అన్నారు. 1,800 కి.మీ.లకు పైగా ఉన్న ఈ మార్గం ద్వారా తుర్క్మెనిస్తాన్లోని గాల్కినిష్ చమురుక్షేత్రం(ఇక్కడ 16 ట్రిలియన్ ఘనపుటడుగుల చమురు నిల్వలున్నాయి) నుంచి అఫ్గాన్, పాక్, భారత్‌కు ఏడాదికి 3.2 బిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ సరఫరా చేయాలన్నది ప్రణాళిక. 2018 కల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇరాన్ ద్వారా తుర్క్మెనిస్తాన్కు రవాణా మార్గం పూర్తి చేసేందుకూ ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. దాంతోపాటు ప్రతిపాదిత కజకిస్తాన్- తుర్క్మెనిస్తాన్-ఇరాన్ రైలు మార్గం కూడా ఈ దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందన్నారు. మోదీ, బెర్దిముఖమెదోవ్ చర్చల తర్వాత సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తాపి ప్రాజెక్టును సత్వరం పూర్తిచేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 1 కల్లా కన్సార్షియం నేతల ఎంపికను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తుర్క్మెనిస్తాన్లో భారత్ యూరియా ఉత్పత్తి కేంద్రం ప్రారంభించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయన్నారు. గాంధీ ఆశయాలతోనే ఉగ్రవాదానికి చెక్ తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గాబట్లో సంప్రదాయ వైద్యం, యోగా కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. తర్వాత అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉగ్రవాదం, పర్యావరణ సమస్యలే ప్రపంచం ముందున్న పెద్ద సవాళ్లని, మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు అనుసరించడమే వీటికి పరిష్కారమని చెప్పారు. యోగా అనేది భౌతిక వ్యాయామం కాదని, దేహం, మనస్సు, బుద్ధిని అనుసంధానించే ప్రక్రియ అని పేర్కొన్నారు. రష్యాలో బ్రిక్స్, ఎస్సీవో సదస్సుల్లో పాల్గొన్న అనంతరం మోదీ శుక్రవారం రాత్రి తుర్క్మెనిస్తాన్ చేరుకున్నారు. -
రాళ్లుండవు.. పాలరాళ్లే..
ఇది తుర్క్మెనిస్తాన్ రాజధా ని అష్గాబాద్. దీనికో ప్రత్యేకత ఉంది. ఫొటో చూస్తే మీకే తెలుస్తుంది. అంతా తెల్లగా మెరిసిపోతుంది కదూ.. భవనాలతో సహా.. అదే దీని స్పెషాలిటీ. అదంతా ఖరీదైన ఇటాలియన్ వైట్ మార్బుల్. ఈ నగరంలో దాదాపు 600 భవనాలు పాలరాయితోనే కట్టారు. ప్రపంచంలోనే మరే నగరంలోనూ ఈ స్థాయి పాల రాయి భవంతులు లేవట. అందుకే గతేడాది గిన్నిస్ బుక్ వారు కూడా ఈ విషయంలో ప్రపంచ రికార్డును అష్గాబాద్కు కట్టబెట్టేశారు.