యాష్గబట్: కుక్కలకుండే విశ్వాసం మనుషులకు కూడా ఉండదని..చాలామంది కుక్కలను ఎంతో అపురూపంగా పెంచుకుంటుంటారు. కుక్కలను అమితంగా ఇష్టపడే వారిలో తుర్క్‌మెనిస్థాన్ దేశాధినేత గుర్బంగులి బెర్డిముఖమెదోవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు సెంట్రల్ ఆసియాలో నివసించే ‘అలబాయ్’ అనే అరుదైన జాతి కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే ఈ జాతి కుక్కల స్మృతిగా శునక విగ్రహాన్ని బంగారంతో చేయించి దేశ రాజధాని యాష్గబట్‌లోని ప్రధాన కూడలిలో ప్రతిష్టించారు. తాజాగా ఆయన మరో అడుగు ముందుకేసి.. వార్తల్లో నిలిచారు. అలబాయ్ జాతి కుక్కల గౌరవార్థం ఏప్రిల్ చివరి ఆదివారాన్ని ‘నేషనల్ హాలిడే’గా ప్రకటించారు. ఇదేరోజు స్థానిక గుర్రపు జాతిని స్మరించుకోవడంతోపాటు అలబాయ్ డేను కూడా ఘనంగా జరుపుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అంతేగాక ఆరోజు డాగ్ బ్యూటీ అండ్ అగ్లీ కాంటెస్ట్‌లు నిర్వహిద్దామని గుర్బగులి పేర్కొన్నారు.
అత్యంత ప్రాచుర్యం పొందిన జాతులలో ఒకటైన అలబాయ్ శునకం.. రష్యాతోపాటు, ఇతర మధ్య ఆసియా దేశాలలో కనిపిస్తుంది. తుర్క్‌మెనిస్థాన్‌లోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ శునకాలను, గుర్రాలను గౌరవించే సంప్రదాయం ఉంది. వాళ్లు తమ పశుసంపదతోపాటు వీటిని కూడా ప్రేమతో పెంచుకుంటారు. తుర్క్‌మెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బంగులి జాతి కుక్కల మీద ఓ పాట రాయడంతోపాటు ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. అంతేగాక 2017లో గుర్బంగులి అలబాయ్ శునకాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment