ఉగ్రవాదమా.. పర్యాటకమా?
⇒ 40 ఏళ్ల రక్తపాతంతో ఎవరూ లాభపడలేదు
⇒ కశ్మీర్ యువతకు మోదీ హితవు..
⇒ కశ్మీరియత్, జమ్మూరియత్, ఇన్సానియత్ నినాదంతో ముందుకెళ్లాలి
⇒ చెనాని–నష్రీ సొరంగం హృదయాల్ని కలిపే వారధి
ఉధంపూర్: కశ్మీర్ యువత ముందు ఉగ్రవాదం, పర్యాటకం అనే రెండు దారులున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కశ్మీర్ అభివృద్ధి కోసం ఉగ్రవాదాన్ని కాకుండా పర్యాటకాన్ని ఎంచుకోవాలని కశ్మీరీ యువతకు ప్రధాని సూచించారు. 40 ఏళ్లుగా కశ్మీర్‌లో సాగుతున్న రక్తపాతంతో ఏ ఒక్కరూ లాభపడలేదని అన్నారు. చెనాని–నష్రీ సొరంగ మార్గం ప్రారంభోత్సవం అనంతరం ఉధంపూర్‌లో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ... ‘ఈ సొరంగం కేవలం మౌలిక సదుపాయాల అనుసంధాన వ్యవస్థే కాదు.. హృదయాల్ని కలిపే వారధి’ అని మోదీ అభివర్ణించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ నినాదమైన ‘కశ్మీరియత్, జమ్మూరియత్, ఇన్సానియత్’ ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ‘ఈ ముఖ్య నినాదాన్ని వాడుకుంటూ.. సామరస్యం, సౌభ్రాతృత్వం, ధృఢ సంకల్పంతో యువత ఉజ్వల భవిష్యత్తు కోసం తీర్మానం చేసుకుని ముందుకు సాగాలి. ఈ ప్రయత్నంలో ఏ అడ్డంకి మనల్ని ఆపలేదు’ అని ప్రధాని అన్నారు.
రాళ్లను మంచి పనులకు ఉపయోగించొచ్చు..
కశ్మీర్‌లో రాళ్లదాడికి పాల్పడుతున్న యువత ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని ప్రధాని హితబోధ చేశారు. ‘రాళ్లను మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి మంచి పనులకు కూడా ఉపయోగించవచ్చు. రాయి శక్తిని గ్రహించాలని కశ్మీర్ లోయలో తప్పుదారి పడుతున్న యువతకు చెప్పాలనుకుంటున్నా. తప్పుదారి పట్టిన కొంతమంది యువత ఒకవైపు రాళ్లదాడి చేస్తుంటే... మరోవైపు అదే కశ్మీర్‌కు చెందిన మరికొంతమంది యువత మౌలిక సదుపాయాల నిర్మాణాల కోసం రాళ్లను చెక్కుతున్నారు. మీ భవిష్యత్తును నిర్ణయించేందుకు మీ ముందు రెండు దారులున్నాయి. ఒకటి పర్యాటకం, మరొకటి ఉగ్రవాదం. గత 40 ఏళ్లుగా కశ్మీర్ లోయలో ఎంతో రక్తపాతం చోటుచేసుకుంది. నా ప్రియమైన కశ్మీరీ యువత, ప్రియమైన హిందుస్తాన్ యువత.. ఇద్దరిలో ఎవరూ కూడా ఈ రక్తపాతంతో లాభపడలేదు’ అని ఆవేదనగా చెప్పారు. కశ్మీర్ ప్రజలు ఆ 40 సంవత్సరాల్ని పర్యాటకం అభివృద్ధికి అంకితం చేసి ఉంటే.. కశ్మీర్ లోయ ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా నిలిచేదన్నారు.
సూఫీ సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ అంధకారమే..
వెలకట్టలేని సూఫీ సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తే.. కశ్మీరీ యువత వర్తమానం కోల్పోవడమే కాకుండా భవిష్యత్ అంధకారమవుతుందని ప్రధాని హెచ్చరించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ నేతలు ఆ దేశ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. జమ్మూ కశ్మీర్ సత్వర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలో ఉన్న ప్రజలు తామెలా నష్టపోతున్నారో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధే చాటిచెప్తుందని అన్నారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి కోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాలని కోరారు.