పొట్టకూటికి రాళ్లు రువ్వుతున్నారు
న్యూఢిల్లీ: కశ్మీర్ యువతకు టూరిజం కావాలో, టెర్రరిజం కావాలో తేల్చుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం కశ్మీర్‌ను సందర్శించినప్పుడు కామెంట్ చేశారు. యతి, ప్రాసలతో కూడిన కామెంట్లు చేయడం, మీడియాను ఆకట్టుకోవడం ఆయనకు ఆది నుంచి అలవాటు. టూరిజాన్ని వదిలేసి టెర్రరిజమ్ వైపు వెళ్లడం కశ్మీర్ యువతకు ప్యాషన్ కాదు. ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వం మీద ద్వేషం వారికి. ఆక్రోశంతో రాళ్లు రువ్వడం ప్రారంభించినా అది వారి బతుకుతెరువుగా మారుతోంది. రాళ్లు రువ్వినందుకు నెలకు ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వారికి మిలిటెన్సీని ప్రోత్సహిస్తున్న వారి నుంచి అందుతున్న విషయం తెల్సిందే.
జమ్మూ కశ్మీర్‌లో చదువుకున్న ఇంజనీర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. స్వరాష్ట్రంలో పొరుగు రాష్ట్రాల్లో వారికి ఉద్యోగాలు లేవు. వారంతా నిరాశ, నిస్పహలతో రగిలిపోతున్నారు. నిపుణులైన జర్నలిస్టులు ఉన్నారు. ఫొటో గ్రాఫర్లు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో పనిచేసే వారికి చేతికందే ఆదాయం పొట్టకూటికే సరిపోదు. దేశంలో 18 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు నిరుద్యోగుల సంఖ్య జాతీయ సగటు 13.2 శాతం ఉండగా, జమ్మూ కశ్మీర్‌లో దాదాపు రెండింతలు, అంటే 24.6 శాతం ఉన్నట్లు 2016లో నిర్వహించిన ఆర్థిక సర్వేనే తెలియజేస్తోంది.
ఒక్క ఎంప్లాయిమెంట్ డిపార్ట్‌మెంట్ వద్దనే తమ పేర్లను నమోదు చేసుకున్న యువకులు లక్ష మందికిపైగా ఉన్నారు. వారికి ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలుగానీ, కంపెనీలుగానీ లేనందున వారంతా ప్రభుత్వం ఉద్యోగాల కోసం నిరీక్షించాల్సిందే. ఒక్క పోలీసు ఉద్యోగాలు తప్పించి ఇతర ఉద్యోగాలు వారికి అందుబాటులో లేవు.
(చదవండి...అక్కడ రాళ్లు విసిరితే డబ్బులిస్తారు)
ల్యాప్ టాప్‌లు పట్టుకోవాల్సిన చేతులు రాళ్లు పట్టుకుంటున్నాయని కూడా నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. నెలల తరబడి ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వమే నిలిపివేస్తుంటే వారు ల్యాప్ టాప్‌లను పట్టుకొని మాత్రం ఏం చేస్తారు. రాళ్లు విసిరితే నాలుగు డబ్బులైన వస్తాయి. గతేడాది మిలిటెంట్ బుర్హాని ఎన్‌కౌంటర్ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్‌లో రెండు నెలలు కూడా ఇంటర్నెట్ పనిచేయలేదు. రాళ్లు రువ్వడంలో మరణిస్తున్నదీ, మిలిటెంట్లుగా మారుతున్న వారు కూడా బాగా చదువుకున్న వారే కావడం గమనార్హం. ఎంతో మంది ఇంజనీరింగ్ చదవిన విద్యార్థులు ఉద్యోగాలు రాక, టెర్రరిజమ్ వైపు మొగ్గు చూపుతున్న విషయం తెల్సిందే.
వారందరు కూడా రాళ్లను పేర్చి ప్రాజెక్టులు కట్టాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏం ప్రాజెక్టులు కడుతున్నారు? రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివద్ధి చేసినా కశ్మీర్‌లో సగం నిరుద్యోగ సమస్య తీరిపోయేది. అబ్బురపరిచే కశ్మీర్ అందాలు బాలివుడ్ సినిమాల్లో కనిపిస్తాయితప్ప నిజ జీవితంలో కనిపించవు.
అందంగా కనిపించే దాల్ లేక్‌ను దూరం నుంచి చూడాల్సిందే తప్ప దగ్గరికెళితే కంపు భరించలేం. పర్యాటక ప్రాంతాలను అభివద్ధికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా కేంద్రం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేవీ లేవు. మిలిటñ న్సీ కారణంగా పర్యాటక ప్రాంతాలను అభివద్ధి చేయలేక పోతున్నామని ప్రభుత్వం సాకులు చెబుతోంది. అభివద్ధికి, మిలిటెన్సీకి అవినాభావ సంబంధం ఉందన్న విషయాన్ని గ్రహించి పనులు చేపడితే ఫలితం రావచ్చు. –ఓ సెక్యులరిస్ట్ కామెంట్