బ్యాంకుల పల్లెటూరు | private banks are targeting villages | Sakshi
Sakshi News home page

బ్యాంకుల పల్లెటూరు

Published Tue, Dec 3 2013 12:48 AM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM

బ్యాంకుల పల్లెటూరు - Sakshi

బ్యాంకుల పల్లెటూరు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆ ఊరిపేరు పుల్లూరు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్ చౌరస్తాకు దగ్గరగా ఉంటుంది. అక్కడివారెవరూ ఇప్పటిదాకా తమ ఊళ్లో బ్యాంకు వస్తుందనుకోలేదు. ఈ మధ్యే తొలిసారిగా ఓ ప్రైవేటు బ్యాంకు చిన్న ప్రయోగం చేసింది. ఇద్దరు ఉద్యోగులుండే చిన్న శాఖను ఏర్పాటు చేసింది. తొమ్మిది నెలలు తిరక్కుండా ఆ శాఖ రూ.5 కోట్లకు పైగా వ్యాపారం చేసింది. బ్యాంకింగ్ వర్గాలు నివ్వెరపోయాయి. పల్లెల్లో ఉండే వ్యాపారమేంటో వాటికి తెలిసొచ్చింది. అందుకే ఇపుడు ప్రైవేటు బ్యాంకులన్నీ గ్రామాల బాట పడుతున్నాయి. ‘ఇండియా’ కన్నా ‘భారత్’లోనే ఎక్కువ వ్యాపారావకాశాలున్నాయని గట్టిగా నమ్ముతున్నాయి. స్మార్ట్ శాఖలతో విస్తరిస్తున్నాయి. మరోవంక గ్రామాల నాడి పట్టుకోవటంలో భాగంగా బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వ బ్యాంకులు... ఆ కరస్పాండెంట్లలో ప్రొఫెషనలిజం లేక చతికిలబడుతున్నాయి. ఇవీ... మన బ్యాంకుల పలె‘్లటూరు’ విశేషాలు.

 

 ప్రైవేటు బ్యాంకులు జోరు..

 గ్రామాల్లో బ్యాంకుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు ఒక్కరు లేదా ఇద్దరు సిబ్బంది ఉండేలా చిన్న చిన్న శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. ‘మిని’ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ బ్యాంకులకు ఆదరణ బాగుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ మధుసూదన్ హెగ్డే చెప్పారు. సాధారణంగా ఒక పెద్ద శాఖను ఏర్పాటు చేయడానికి కనీసం రూ.30 లక్షలు అవుతుందని, కానీ రూ.8 లక్షల వ్యయంతోనే ఈ మినీ శాఖలను ఏర్పాటు చేయగలుగుతుండటంతో ఏడాది తిరక్కుండానే ఇవి బ్రేక్ ఈవెన్ సాధిస్తున్నాయని ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మినీ శాఖలను ఏర్పాటు చేయగా, దేశవ్యాప్తంగా 225 శాఖలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.

 

  ‘‘ప్రతి శాఖలో ఏటీఎం కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణులకు సులభంగా అర్థమయ్యేలా ఈ ఏటీఎంలను రూపొందిస్తున్నాం’’ అన్నారాయన. ప్రైవేటు రంగంలో దేశీయంగా అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ కూడా గ్రామాలపై అధికంగా దృష్టిసారిస్తోంది. ఇంతవరకు బ్యాంకింగ్ సౌకర్యం లేని 60కి పైగా గ్రామాల్లో పూర్తిస్థాయి శాఖలను ఏర్పాటు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఈడీ రాజీవ్ సభర్వాల్ చెప్పారు. 3,130 గ్రామాల్లో కస్టమర్ సర్వీస్ పాయింట్లను ఏర్పాటు చేశామని, తద్వారా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారాయన. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్గాల ద్వారా 5,600 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నట్ల తెలియజేశారు. ‘‘ఈ శాఖలను ప్రధాన సర్వర్‌కి అనుసంధానం చేస్తున్నాం. నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. కాబట్టి భద్రతపై భయాలు అవసరం లేదు’’ అన్నారాయన. మినీ బ్యాంకుల్లో లాకర్లు, ఏటీఎం, డెబిట్, క్రెడిట్, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి సౌకర్యాలను అందిస్తుండటంతో వీటి సేవలపై గ్రామీణులు మొగ్గు చూపుతున్నారు.  ఈ శాఖల్లో రోజుకు సగటున 15 లావాదేవీలు జరుగుతున్నాయని, సగటు సేవింగ్ ఖాతా డిపాజిట్ రూ.18,000గా ఉందని హెగ్డే తెలిపారు.

 

 ప్రభుత్వ బ్యాంకుల బేజారు..

 ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం గ్రామాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయడం కన్నా బిజినెస్ కరస్పాండెంట్స్, సర్వీస్ పాయింట్ల విధానంపైనే ఆధారపడుతున్నాయి.  ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ పేరిట ఈ బ్యాంకులన్నీ పెద్ద సంఖ్యలో కస్టమర్ల చేత ఖాతాలు తెరిపించాయే తప్ప వాటిల్లో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు. దేశవ్యాప్తంగా 2.40 లక్షల గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చామని ఆర్‌బీఐ చెప్పుకుంటున్నా... వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇలా తెరిపించిన వాటిలో 96 శాతం ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని ఒక సర్వేలో వెల్లడయింది.

 

  బిజినెస్ కరస్పాండెంట్లకు ఇచ్చే కమీషన్లు చాలా తక్కువగా ఉండటంతో వారు రోజువారీ బ్యాంకింగ్ కార్యకలాపాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని, గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా పెద్ద సమస్యగా మారడంతో ఈ విధానం ఆచరణలో  ఫెయిలవుతోందని ఆంధ్రా బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అంతేకాక గ్రామాల్లో నగదు లావాదేవీల వివరాలు మూడో వ్యక్తికి తెలియడం ఇష్టం ఉండదని, కాని ఈ విధానంలో మూడో వ్యక్తిపైనే ఆధారపడాల్సి రావటం కూడా ఇది విఫలం కావడానికి మరో కారణమని సిండికేట్ బ్యాంక్ అధికారి ఒకరు విశ్లేషించారు. గ్రామాల్లో సొంతగా శాఖలు ఏర్పాటు చేయడం లేదా పోస్టాఫీసును బ్యాంకులుగా మార్చినప్పుడే అన్ని గ్రామాలకూ  బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement