మాకు ఈ రోజే అందాయి: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన భర్త రాబర్ట్ వాద్రాకు జారీచేసిన నోటీసులపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ స్పందించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తమకు ఈడీ నోటీసులు అందాయని ఆమె తెలిపారు.
రాజస్థాన్ లో భూముల కొనుగోలు విషయంలో మనీలాండరింగ్ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు తమ ముందుకు హాజరుకావాలంటూ ఈడీ రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీచేసింది. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడైన వాద్రాను కార్నర్ చేయడం ద్వారా తమ పార్టీ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ స్పందిస్తూ 'మేం ఈ రోజు 4 గంటలకు ఈడీ నోటీసులు అందుకున్నాం. మీకు (మీడియా) ఇవి నిన్ననే అందినట్టు ఉన్నాయి' అని పేర్కొన్నారు. బీజేపీ సర్కార్ ఉద్దేశపూరితంగానే ఈడీ నోటీసు వార్తలను ముందే మీడియాకు లీక్ చేసినట్టు ఆమె ఆరోపించారు.