ఇన్వెస్ట్‌మెంట్స్‌లో అధిక రాబడులు పొందాలంటే ఎంతోకొంత నష్టభయానికి (రిస్క్) సిద్ధపడాల్సిందే. ఎంత రిస్క్ చేయగలిగితే ప్రతిఫలం కూడా అదే స్థాయిలో ఆశించవచ్చు. కాని ఈ రిస్క్ అనేది వ్యక్తిని బట్టి మారిపోతుంటుంది. ఈ వ్యక్తిగతమైన రిస్క్‌లను పక్కకు పెడితే మార్కెట్లో కూడా అనేక రకాల నష్టాభయాలు ఉం టాయి. వీటన్నింటిని ఓర్పుగా, సహనంగా ఎదుర్కొన్నప్పుడే దీర్ఘకాలంలో సంపదను వృద్ధి చేసుకోగలం. ఇప్పుడు మార్కెట్లో ఉండే నష్టభయాలు, వాటిని ఎదుర్కొనే తీరుతెన్నులు తెలుసుకుందాం.
మార్కెట్ రిస్క్: ఇది ప్రధానంగా మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటుంది. మనలో చాలామంది స్టాక్ మార్కెట్లు బాగా పతనమై షేర్లు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు కాకుండా, అవి బాగా పెరిగి గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి వెంటపడతారు. పెరుగుతున్న షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులొస్తాయని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి పతనం మొదలైతే రిస్క్ ఎంత ఉంటుందని ఆలోచించరు. ఈ రిస్క్‌ను అధిగమించాలంటే... మార్కెట్లు పెరుగుతున్నప్పుడు విలువ పరంగా తక్కువ ధరలో ఉన్న షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అందులో ఒడిదుడుకులు తక్కువగా ఉండే షేర్లయితే ఇంకా మంచిది.
ఎకానమీ రిస్క్: ఒక దేశ ఆర్థిక పరిస్థితులు ఆయా స్టాక్ మార్కెట్లను బాగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితిని చూస్తే ఇబ్బందికరంగానే ఉంది. అధిక ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణాలకు తోడు, వడ్డీరేట్లు పెరుగుతుండటం, ఎన్నికల వాతావరణం, సంస్కరణలు జరగకపోవడం వంటి అనేక అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో షేర్లను ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్న సమయంలో కూడా పెరగడానికి అవకాశమున్న షేర్లను ఎంపిక చేసుకోవాలి. అలాగే దీర్ఘకాలిక దృష్టితో వృద్ధికి అవకాశం ఉన్న షేర్లను ఎంచుకోవాలి.
రంగాల వారీ రిస్క్: ఒక్కసారిగా ప్రభుత్వం, ఆర్‌బీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థలు తీసుకునే చర్యలు, లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆయా రంగాలపై పెను ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఉదాహరణకు ఈ మధ్య మైనింగ్, టెలికాం వంటి రంగాలు నియంత్రణ సంస్థల నిబంధనల వలన బాగా దెబ్బతిన్నాయి. 2,000 సంవత్సరంలో కూడా ఐటీ సెక్టార్ ఒక్కసారిగా ఎలా కుప్పకూలిందో మనకు అనుభవమే. ఇటువంటి రిస్క్ నుంచి తప్పించుకోవాలంటే పెట్టుబడులు మొత్తం ఒకే రంగంలో కాకుండా విభిన్న రంగాలకు కేటాయించాలి. ఇలా పెట్టుబడుల్లో వైవిధ్యం చూపించినప్పుడు ఒక రంగంలో ఉన్న రిస్క్‌ను ఇంకో రంగం ద్వారా పూడ్చుకునే లేదా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం కలుగుతుంది.
కంపెనీల రిస్క్...
అనుకోని కుంభకోణాలు వెలుగు చూడటం వలన ఒక్కసారిగా కంపెనీల షేర్లు కుప్పకూలడం చూస్తూనే ఉంటాం. అందుకే షేర్లను ఎంపిక చేసుకున్నప్పుడే అన్ని అంశాలను పరిశీలించాలి. ఫండమెంటల్, మేనేజ్‌మెంట్ పరంగా చాలా పటిష్టంగా ఉండి, వేల్యూ పరంగా ఆకర్షణీయంగా ఉన్న షేర్లలోనే ఇన్వెస్ట్ చేయండి. బాగా పెరిగిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే పతనం ప్రారంభమైతే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు. అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌లో అధిక మొత్తం ఒకే కంపెనీకి చెందిన షేర్లకు కేటాయించకుండా పోర్ట్‌ఫోలియోలో విభిన్న రంగాలకు చెందిన 8-12 కంపెనీల షేర్లు ఉండే విధంగా చూసుకోవడం ద్వారా నష్టభయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు.
రిస్కు తీసుకోవచ్చు కానీ...
Published Sun, Oct 20 2013 1:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement