ఆస్తి అమ్మకాలకు మరింత కష్టకాలం
ఆస్తి అమ్మకాలకు మరింత కష్టకాలం
Published Fri, Jan 27 2017 3:13 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ స్టాక్స్కు మంచి ఏడాది ఏదైనా ఉందంటే అది 2007నే. అప్పటినుంచి ఇప్పటివరకు మార్కెట్లో రియాల్టీ స్టాక్స్ కోలుకోలేని దెబ్బతింటున్నాయి. ప్రతేడాది 85 శాతం కుప్పకూలుతూ వస్తున్నాయి. 2007 డిసెంబర్ నుంచి 2017 జనవరి 25 వరకు బీఎస్ఈ రియాల్టీ సూచీ దాదాపు 90 శాతం పడిపోయింది. దీనికి తోడు పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్8న కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం. వీటికి మరింత ప్రతికూలంగా మారింది. బ్లాక్మనీకి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి 2017లోనూ ఆస్తి అమ్మకాలు మరో 30 శాతం కిందకి పడిపోతాయట.
ఫిచ్ రేటింగ్స్ అంచనాల ప్రకారం దేశంలో ప్రాపర్టీ అమ్మకాలు 20-30 శాతం కిందకి పడిపోతాయని తెలిసింది. పెద్ద నోట్ల రద్దు, ఇతర అంశాలు గృహ కొనుగోలుదారుల్లో సెంటిమెంట్ను మరింత బలహీనపరిచాయని రేటింగ్ సంస్థ పేర్కొంది. నోట్ల రద్దుతో గృహాల కొనుగోలుకు డిమాండ్ తగ్గడంతో బిల్డర్స్ చుక్కలు చూస్తున్నారు. డిమాండ్ బలహీన దశలో ఉండటంతో ఆస్తుల అమ్మక ధరలు తగ్గించడానికి బిల్డర్స్ వెనుకాడటం లేదు. లిక్విడిటీపై మరిన్ని ఆంక్షలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ ఈ బడ్జెట్లో లిక్విడిటీపై ఆంక్షలు పెరిగితే రియాల్టీ అమ్మకాలు 2017లోనూ కష్టకాలం ఎదుర్కోవాల్సి వస్తుందని ఫిచ్ తెలిపింది.
ఈ ఏడాది గృహ ధరలు భారీగా తగ్గుతాయని ఫిచ్ అంచనావేస్తోంది. నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ అంచనా ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకాలు 2016 చివరి త్రైమాసికంలో యేటికేటికి 44 శాతం పడిపోతాయని, మొత్తంగా అమ్మకాలు 9 శాతం క్షీణిస్తాయని తెలుస్తోంది. దీంతో మార్కెట్లో రియాల్టీ స్టాక్స్ మరింత పడిపోనున్నాయట. యూనిటెక్, హెచ్డీఐఎల్, శోభా డెవలపర్స్, ప్రెస్టేజి ఎస్టేట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ వంటివి భారీగా క్షీణించనున్నాయట. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, లోధా డెవలపర్స్ వాటి బ్రాండ్ విలువతో కొంత లాభపడొచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Advertisement
Advertisement