రక్షణలో ఎస్‌ఈసీ సత్తా...
రక్షణలో ఎస్‌ఈసీ సత్తా...
Published Thu, Sep 19 2013 3:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, ఏరోస్పేస్ రంగంలో ప్రత్యేక ఇంజనీరింగ్ పరికరాల తయారీలో నైపుణ్యం సొంతం చేసుకున్న ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌కు విదేశీ ఆర్డర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. నౌకలు, జలాంతర్గాముల తయారీలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న ఫ్రాన్స్ కంపెనీ డీసీఎన్‌ఎస్ తమతో చేతులు కలపడం కలిసి వచ్చిందని ఎస్‌ఈసీ ఎండీ దొంతినేని విద్యాసాగర్ అన్నారు. డీసీఎన్‌ఎస్ చేపడుతున్న ప్రాజెక్టుల్లో పాలుపంచుకోవడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగామని ఆయన చెప్పారు. కంపెనీ ఏర్పాటై అక్టోబరుకు 60 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే..
ఏదైనా సాధ్యం చేస్తాం..
వ్యవసాయ పంపుసెట్ల తయారీ కంపెనీగా 60 ఏళ్ల క్రితం ప్రస్థానాన్ని ప్రారంభించాం. నేడు రక్షణ, ఏరోస్పేస్ రంగంలో ప్రత్యేకత ఉన్న హైటెక్ ఇంజనీరింగ్ పరికరాల తయారీలో నైపుణ్యం సొంతం చేసుకున్నాం. ప్రాజెక్టు ఏదైనా సరే సుసాధ్యం చేస్తాం. హైదరాబాద్‌లో మరో ప్లాంటు వచ్చే ఏడాది నెలకొల్పుతున్నాం. కేంద్రీకృత తయారీ కేంద్రంతోపాటు తీసుకున్న కాంట్రాక్టులనుబట్టి వివిధ అసెంబ్లింగ్ లైన్స్‌ను ఏర్పాటు చేస్తాం. 300 మందిని నియమించుకుంటాం. ఇక్కడ విదేశాలకు ఎగుమతయ్యే పరికరాలనే తయారు చేస్తాం. భావన(కాన్సెప్ట్) నుంచి తయారీ వరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించేందుకే కొత్త ప్లాంటును స్థాపిస్తున్నాం.
నిర్ణీత గడువులోగా..
స్కార్పీన్ జలాంతర్గాముల కాంట్రాక్టును కేంద్ర ప్రభుత్వం డీసీఎన్‌ఎస్‌కు ఇచ్చింది. వీటి తయారీకి కావాల్సిన ప్రధాన భాగాల్లో 14 రకాలను మేం సరఫరా చేస్తున్నాం. కాంట్రాక్టు విలువ రూ.400 కోట్లు. గడువులోగా అంటే 2015 డిసెంబరు కల్లా సరఫరా చేస్తాం. మరో ఆరు జలాంతర్గాముల సరఫరా కాంట్రాక్టు డీసీఎన్‌ఎస్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే మాకు మరోసారి రూ.400 కోట్ల కాంట్రాక్టు ఆశిస్తున్నాం. డీసీఎన్‌ఎస్ కోసం బాలానగర్‌లో ఉన్న ప్లాంటులో రూ.20 కోట్లతో ఫెసిలిటీ ఏర్పాటు చేశాం.
డీసీఎన్‌ఎస్ భాగస్వామ్యంతో..
డీసీఎన్‌ఎస్ ఒప్పందంతో మా సంస్థ నావికా రంగంలోకి ప్రవేశించింది. రక్షణ పరికరాల తయారీలో ఉన్న ప్రపంచ ప్రముఖ సంస్థలు హైదరాబాద్ వైపు మళ్లేందుకు కారణమయ్యాం. అయితే ఇతర దేశాలకు జలాంతర్గాములను సరఫరా చేసే కాంట్రాక్టుల్లో భాగంగా బాలానగర్ ప్లాంటును కేంద్ర బిందువుగా చేసుకోవాలని డీసీఎన్‌ఎస్ భావిస్తోంది. వచ్చే ఏడాది నుంచి సరఫరా ప్రారంభం కానుంది. అలాగే సముద్ర అలల ఆధారంగా పనిచేసే విద్యుత్ ప్లాంట్లను ఫ్రాన్స్‌లో పెట్టే పనిలో డీసీఎన్‌ఎస్ నిమగ్నమైంది. ఈ ప్లాంట్లకు కావాల్సిన 50 శాతం పరికరాలను మేం సరఫరా చేయనున్నాం.
వెల్లువలా కొత్త కాంట్రాక్టులు..
ట్రైలర్ మౌంటెడ్ ఎయిర్ డిఫెన్స్ యాంటెన్నా సరఫరా ప్రాజెక్టును భారత రక్షణ శాఖ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌కు(ఐఏఐ) ఇచ్చింది. 300-600 కిలోమీటర్ల పరిధిలో క్షిపణుల రాకను ఇది గుర్తిస్తుంది. దేశీయంగా తొలిసారిగా ఐఏఐ, డీఆర్‌డీవోలు సంయుక్తంగా వీటిని రూపొందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు మినహా మిగిలిన భాగాలను ఎస్‌ఈసీ అందిస్తోంది. మిరేజ్ 2000 ఎయిర్‌క్రాఫ్ట్‌కు క్షిపణుల సరఫరా కాంట్రాక్టు ఫ్రాన్స్‌కు చెందిన ఎంబీడీఏ కైవసం చేసుకుంది. ఈ కంపెనీకి ఎయిర్‌బోర్న్ పరికరాలను అందించనున్నాం. ఇక మీడియం మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు కావాల్సిన పరికరాలను అందించే అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాం.
Advertisement