రాహుల్ గాంధీకి పంజాబ్ కోర్టు సమన్లు
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంజాబ్లోని స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 19న తమ ఎదుట హాజరుకావాలని రాహుల్ను న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తరప్రదేశ్, బీహార్ వాసులను అవమానపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారని దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. చండీగఢ్కు చెందిన శివమూర్తి యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2011, నవంబర్ 14న ఫుల్పూర్లో రాహుల్ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. 'మీరు(యూపీ ప్రజలు) పనుల కోసం ఎన్నాళ్లు పాటు పంజాబ్, ఢిల్లీకి వలసవెళతారు. ఎన్నాళ్లు కూలీలుగా ఉంటారు. పని కోసం ఎన్నిరోజులు మహారాష్ట్రను వేడుకుంటారు' అని రాహుల్ వ్యాఖ్యానించినట్టు వెల్లడించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జ్యుడీషియల్ మేజిస్టేట్ జస్విందర్ సింగ్.. రాహుల్ గాంధీకి 'దస్తీ' సమన్లు జారీ చేశారు. గతనెల 17న సమన్లు జారీ చేసినప్పటికీ అవి రాహుల్ గాంధీకి చేరలేదు. దీంతో మరోసారి సమన్లు జారీ చేసింది.