
అమేథీ (యూపీ)/అహ్మదాబాద్: తాజా సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీచేసి ఓడిన అమేథీ నియోజకవర్గంలో నేడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ప్రత్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడారు. తన పర్యటన సందర్భంగా రాహుల్ పార్టీ ప్రతినిధులను కలుస్తారు. సలోన్, అమేథీ, గౌరిగంజ్, జగదీశ్‌పూర్, తిలోయి అసెంబ్లీ నియోజకవర్గ బూత్ అధ్యక్షులను కలుసుకుంటారు. అలాగే కొన్ని గ్రామాలను సందర్శించే అవకాశం ఉందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తెలిపారు. రాహుల్ 1999 నుంచి అమేథీ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు.
రాహుల్‌కి గుజరాత్ కోర్ట్ సమన్లు
హోంమంత్రి అమిత్ షాను హత్య కేసులో నిందితుడిగా పేర్కొని ఆయన పరువుకు నష్టం కలిగించారన్న కేసులో రాహుల్‌కు గుజరాత్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. స్థానిక బీజేపీ నేత ఒకరు రాహుల్‌పై ఈ కేసువేశారు. ఈ కేసులో ఆగస్టు 9న హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మే 1న ఇదే కేసులో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాహుల్‌కి సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన లోక్‌సభ సభ్యుడు కావడంతో లోక్‌సభ స్పీకర్ నోటీసును తిరస్కరించారు. దీంతో ఆగస్టు 9న హాజరు కావాలంటూ తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ నోటీసును రాహుల్ నివాసంలో నేరుగా అందించనున్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ అమిత్ షాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆరోపించారు. సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్‌ను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment