కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరో రాజకీయ రగడ రాజుకుంది. కోల్‌కతాలోని కాశిపూర్‌లో గురువారం జరిగిన బీజేవైఎం కార్యకర్త అర్జున్ చౌరాసియా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. బెంగాల్లో హింసాత్మక సంస్కృతిపెరిగిపోతోందని, ప్రజలు భయభ్రాంతులవుతున్నారని ఆరోపించారు. రెండురోజుల బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం అర్జున్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఈ మరణంపై కేంద్ర హోంశాఖ నివేదిక కోరుతుందని చెప్పారు. మృతదేహాన్ని అధికారులు బలవంతంగా తీసుకుపోయారని కుటుంబీకులు ఆరోపించారు. మరోవైపు అర్జున్ తమ పార్టీ కార్యకర్తేనని అధికార టీఎంసీ బదులిచ్చింది. అర్జున్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని, ప్రక్రియను వీడియో తీయాలని, అతని కుటుంబానికి భద్రత కల్పించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తీసుకువెళ్లేందుకు వచ్చిన పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డగించడంతో అదనపు బలగాలను దింపి పరిస్థితిని అదుపు చేశారు.
పాతికేళ్లలో నంబర్‌వన్‌గా భారత్
పాతికేళ్లలో ఇండియా ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుతుందని అమిత్ షా అన్నారు. బెంగాల్ దుర్గాపూజను అంతర్జాతీయ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ గౌరవం దక్కడం దేశానికే గర్వకారణమని ప్రశంసించారు. విద్య, కళలు, రక్షణ సహా పలు రంగాల్లో భారత్ గత 75ఏళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని, ఇదే ధోరణిలో పయనిస్తే దేశ 100వ స్వాతంత్రదినోత్సవాల నాటికి భారత్ అగ్రగామిగా మారుతుందని చెప్పారు. గతంలో యోగా, కుంభమేళాలకు యునెస్కో ఇలాంటి గుర్తింపునే ఇచ్చింది. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రోద్యమ వీరులకు ఆయన నివాళులర్పించారు. వారి త్యాగాల వల్లనే మనకు స్వేచ్ఛ లభించిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment