kashipur
-
Odisha: జలమే గరళం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య
రాయగడ(ఒడిశా): జిల్లాలోని కాసీపూర్‌లో అతిసార వ్యాధికి కారణం అక్కడి ప్రజలు కలుషితమైన నీటిని తాగడమేనని వైద్యులు ధ్రువీకరించారు. గత నాలుగు రోజుల్లో ఆరుగురు మృతి చెందడంతో పాటు వంద మందికి పైగా వ్యాధిబారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో టికిరి, కాసీపూర్‌లో పర్యటించిన వైద్య బృందం అక్కడ తాగునీటి కోసం వినియోగించే బావుల్లో నీటి నమూనాలను సేకరించారు. ఈ నీటి నమూనాలకు అన్ని పరీక్షలను నిర్వహించి, అతిసార వ్యాధికి కారణం ఆ నీరేనని నిర్ధారించారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లాల్మోహన్ రౌత్రాయ్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు సమాచారం. చదవండి: వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ మరొకరు మృతి శనివారం నాటికి అతిసార వ్యాధితో ఆరుగురు మృతి చెందగా అదేరోజు అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన టికిరి పంచాయతీ పంచాలి గ్రామానికి చెందిన గొదాధర్ గొరడ (53) అనే వ్యక్తి ప్రాణాలను విడిచాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నా టికిరి, కాసీపూర్ ప్రాథమిక ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఆస్పత్రుల్లో 60 మందికి పైగా రోగులు చికిత్స పొందుతుండగా, రాయగడ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో 9 మందికి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే పర్యటన రాయగడ ఎమ్మెల్యే మకరంద ముదులి టికిరి గ్రామంలోని జొడియా వీధిలో ఆదివారం పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. సమీపంలోని తాగునీటి బావిని పరిశీలించారు. కలుషితమైన నీటిని తాగడం వల్లే అతిసార వ్యాపించినట్లు పేర్కొన్నారు. తక్షణమే తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచాలని, దీంతో పాటు జొడియా వీధిలో సోలార్ విద్యుత్‌తో నడిచే మోటారు మరమ్మతులు చేయించాలని రూరల్ వాటర్, సప్లయ్ అండ్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్తగా మరో గొట్టపు బావిని ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం టికిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మజ్జి ఉన్నారు. దుడుకాబహాల్‌లో డయేరియా టికిరి, కాసీపూర్ ప్రాంతాలతో పాటు దుడుకాబహాల్‌లో డయేరియా విజృంభిస్తుండడంతో ఉషాపాడు ఆస్పత్రిలో గత వారం రోజుల్లో 122 మంది చేరారు. వీరిలో 48 మంది పరిస్థితి ఆందోళకరంగా ఉండడంతో వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తూ, మిగతావారిని ఇళ్లకు పంపించినట్లు అధికారులు తెలియజేశారు. ఆస్పత్రిలో రోగుల పరిస్థితులను కలెక్టర్ సింగ్ స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. బావుల మరమ్మతులు కాసీపూర్, టికిరి ప్రాంతాల్లో అతిసార వ్యాపించడానికి కారణం కలుషితమైన నీటిని తాగడమేనని నిర్ధారణకు వచ్చిన జిల్లా యంత్రాంగం అయా ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు అదేశించారు. దీంతో ఆ శాఖకు చెందిన సిబ్బంది టికిరి, కాసీపూర్, దుడకాబహాల్ తదితర ప్రభావిత గ్రామాలకు చేరుకుని బావుల మరమ్మతుల పనుల్లో నిమగ్నమయ్యారు. -
బెంగాల్లో రగడ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరో రాజకీయ రగడ రాజుకుంది. కోల్‌కతాలోని కాశిపూర్‌లో గురువారం జరిగిన బీజేవైఎం కార్యకర్త అర్జున్ చౌరాసియా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. బెంగాల్లో హింసాత్మక సంస్కృతిపెరిగిపోతోందని, ప్రజలు భయభ్రాంతులవుతున్నారని ఆరోపించారు. రెండురోజుల బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం అర్జున్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ మరణంపై కేంద్ర హోంశాఖ నివేదిక కోరుతుందని చెప్పారు. మృతదేహాన్ని అధికారులు బలవంతంగా తీసుకుపోయారని కుటుంబీకులు ఆరోపించారు. మరోవైపు అర్జున్ తమ పార్టీ కార్యకర్తేనని అధికార టీఎంసీ బదులిచ్చింది. అర్జున్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని, ప్రక్రియను వీడియో తీయాలని, అతని కుటుంబానికి భద్రత కల్పించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తీసుకువెళ్లేందుకు వచ్చిన పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డగించడంతో అదనపు బలగాలను దింపి పరిస్థితిని అదుపు చేశారు. పాతికేళ్లలో నంబర్‌వన్‌గా భారత్ పాతికేళ్లలో ఇండియా ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుతుందని అమిత్ షా అన్నారు. బెంగాల్ దుర్గాపూజను అంతర్జాతీయ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ గౌరవం దక్కడం దేశానికే గర్వకారణమని ప్రశంసించారు. విద్య, కళలు, రక్షణ సహా పలు రంగాల్లో భారత్ గత 75ఏళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని, ఇదే ధోరణిలో పయనిస్తే దేశ 100వ స్వాతంత్రదినోత్సవాల నాటికి భారత్ అగ్రగామిగా మారుతుందని చెప్పారు. గతంలో యోగా, కుంభమేళాలకు యునెస్కో ఇలాంటి గుర్తింపునే ఇచ్చింది. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రోద్యమ వీరులకు ఆయన నివాళులర్పించారు. వారి త్యాగాల వల్లనే మనకు స్వేచ్ఛ లభించిందని గుర్తు చేశారు. -
మలి విడత పోరు నేడే
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో మలివిడత ప్రాదేశిక ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. 22 జెడ్పీటీసీ, 332 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో 107 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 1,237 మంది ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 1,044 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 8,43,865 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సాయంత్రం అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సామగ్రితో సహా చేరుకున్నారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి మండలం చెర్లగూడెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని కాశీపూర్‌లోని 43వ నంబరు పోలింగ్ కేంద్రంలో రిపోలింగ్ నిర్వహించున్నారు. ఎన్నికలు జరగనున్న మండలాలు ఇవే.. జిల్లాలో మొదటి విడత గా 24 మండలాల్లో ఎన్నికలు జరగగా, రెండో విడతలో 22 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. చేగుంట, హత్నూర, జిన్నారం, కౌడిపల్లి, నర్సాపూర్, రామాయంపేట, చిన్నశంకరంపేట, తూప్రాన్, శివ్వం పేట, వెల్దుర్తి, పటాన్చెరు, రామచంద్రాపురం, పాపన్నపేట, పుల్కల్, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, టేక్మాల్, తొగుట, వర్గల్, దౌల్తాబాద్, గజ్వేల్, ములుగు మండలాల్లో శుక్రవారం మలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీ నుంచి ఎంత మంది.. మలివిడత ప్రాదేశిక ఎన్నికల బరిలో మొత్తం 1,344 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 22 జెడ్పీటీసీ స్థానాలకుగాను 107 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి 22 మంది, టీఆర్ఎస్ నుంచి 22, టీడీపీ నుంచి 17, బీజేపీ నుంచి 13, సీపీఎం నుంచి నలుగురు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు సీపీఐ అభ్యర్థి జెడ్పీటీసీ బరిలో ఉన్నారు. వీరితోపాటు 24 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 332 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 1,237 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి 14 మంది అభ్యర్థులు, 324 మంది కాంగ్రెస్, 296 మంది టీఆర్ఎస్, 216 మంది టీడీపీ, 161 మంది బీజేపీ, 17 సీపీఎం, 12 సీపీఐ, 11 మంది బీఎస్పీ, ఇద్దరు ఇతర గుర్తింపు పార్టీల అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరితోపాటు 185 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు. భారీ బందోబస్తు ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 36 అతి సమస్యాత్మక ప్రాంతాలుగా, 62 సమస్యాత్మక ప్రాంతాలు, 498 సాధారణ ప్రాంతాలుగా గుర్తించారు. రెండో విడత ఎన్నికల్లో ఇద్దరు ఏఎస్పీలు, ఒకరు ఓఎస్డీ, 12 మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 51 మంది ఎస్ఐలు విధులు నిర్వహించనున్నారు. వీరితోపాటు 2,964 మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.