సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో మలివిడత ప్రాదేశిక ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. 22 జెడ్పీటీసీ, 332 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో 107 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 1,237 మంది ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 1,044 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 8,43,865 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సాయంత్రం అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సామగ్రితో సహా చేరుకున్నారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి మండలం చెర్లగూడెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని కాశీపూర్‌లోని 43వ నంబరు పోలింగ్ కేంద్రంలో రిపోలింగ్ నిర్వహించున్నారు.
ఎన్నికలు జరగనున్న మండలాలు ఇవే..
జిల్లాలో మొదటి విడత గా 24 మండలాల్లో ఎన్నికలు జరగగా, రెండో విడతలో 22 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. చేగుంట, హత్నూర, జిన్నారం, కౌడిపల్లి, నర్సాపూర్, రామాయంపేట, చిన్నశంకరంపేట, తూప్రాన్, శివ్వం పేట, వెల్దుర్తి, పటాన్‌చెరు, రామచంద్రాపురం, పాపన్నపేట, పుల్కల్, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, టేక్మాల్, తొగుట, వర్గల్, దౌల్తాబాద్, గజ్వేల్, ములుగు మండలాల్లో శుక్రవారం మలి విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఏ పార్టీ నుంచి ఎంత మంది..
మలివిడత ప్రాదేశిక ఎన్నికల బరిలో మొత్తం 1,344 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 22 జెడ్పీటీసీ స్థానాలకుగాను 107 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి 22 మంది, టీఆర్‌ఎస్ నుంచి 22, టీడీపీ నుంచి 17, బీజేపీ నుంచి 13, సీపీఎం నుంచి నలుగురు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు సీపీఐ అభ్యర్థి జెడ్పీటీసీ బరిలో ఉన్నారు. వీరితోపాటు 24 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 332 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 1,237 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి 14 మంది అభ్యర్థులు, 324 మంది కాంగ్రెస్, 296 మంది టీఆర్‌ఎస్, 216 మంది టీడీపీ, 161 మంది బీజేపీ, 17 సీపీఎం, 12 సీపీఐ, 11 మంది బీఎస్పీ, ఇద్దరు ఇతర గుర్తింపు పార్టీల అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరితోపాటు 185 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు.
భారీ బందోబస్తు
ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 36 అతి సమస్యాత్మక ప్రాంతాలుగా, 62 సమస్యాత్మక ప్రాంతాలు, 498 సాధారణ ప్రాంతాలుగా గుర్తించారు. రెండో విడత ఎన్నికల్లో ఇద్దరు ఏఎస్పీలు, ఒకరు ఓఎస్‌డీ, 12 మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 51 మంది ఎస్‌ఐలు విధులు నిర్వహించనున్నారు. వీరితోపాటు 2,964 మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
మలి విడత పోరు నేడే
Published Thu, Apr 10 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement