సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మలి విడత ప్రాదేశిక పోరులోనూ భారీగా పోలింగ్ జరిగింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 81.73 శాతం పోలింగ్ నమోదైంది. కాగా రెండో విడత బ్యాలెట్ పత్రాల ముద్రణలోనూ పొరపాటు దొర్లింది. వెల్దుర్తి మండలం చెర్లపల్లి గ్రామంలో ఎంపీటీసీ-2 బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లను తప్పుగా ముద్రించారు. 30 ఓట్లు పడిన తర్వాత గుర్తించిన అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. ఈ నెల 13న రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించారు.
తొలి విడత ఎన్నికల్లోనూ సంగారెడ్డి మండలం కాశీపురంలో ఇదే తరహా పొరపాటు దొర్లగా శుక్రవారం ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు. పై రెండు సంఘటనలకు బాధ్యులను చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్ చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఎండ తీవ్రతతో మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల గంటల తరబడి ఎండలో నిలబడి ఓట్లు వేయాల్సి రావడంతో కొందరు కళ్లు తిరిగిపడిపోయారు. వర్గల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే నర్సారెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
చెర్లగూడెం ఎంపీటీసి పరిధిలోని కాశీపూర్ గ్రామంలో 43 బూత్‌లో రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తొలి విడతలో ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలపై పేర్లు తప్పుగా ముద్రించడంతో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు.
నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, వర్గల్, మలుగు మండలాల్లో శుక్రవారం స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
వర్గల్ మండలం గౌరారం గ్రామంలోని రెండు పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ స్లిప్‌లు ఓటరు జాబితాతో పొంతన లేకపోవడం వల్ల వాటిని సరిచేసేసరికి చాలా సమయం పట్టింది. ఫలితంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
వర్గల్‌లో పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీడీపీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ప్రచారంలో భాగంగా ‘నన్ను కించపరిచే విధంగా మాట్లాడతావా?’ అంటూ ఎమ్మెల్యే.. శ్రీనివాస్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి నువ్వెంత? అంటే నువ్వెంత? అంటూ పరస్పరం ధూషణకు దిగారు. ఫలితంగా ఇరు పార్టీల నాయకులు పోగై ఘర్షణ తలెత్తే వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
తూప్రాన్ మండలం రంగాయపల్లి గ్రామంలో గీత దాటి వెళ్లి టీఆర్‌ఎస్, టీడీపీ నాయకులు ప్రచారం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు చెదగొట్టారు.
నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంట గ్రామంలో ఓటు వేయడానికి వచ్చిన నాగభూషణం అనే వ్యక్తిపై ఓ కానిస్టేబుల్ చేయి చేసుకోవడమే కాక, పోలీసు స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. పోలీసుల తీరుపై గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన్ను విడిచి పెట్టేవరకు పోలింగ్ జరపవద్దని పట్టుబట్టారు. చివరకు పోలీసులు దిగొచ్చి నాగభూషణంను వదిలేశారు.
హత్నూర మండలంలోని నాగారం, బోర్పట్ల గ్రామాలతో పాటు కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలో పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఓటర్లు ఇంకా బారులు తీరి ఉన్నారు. వారికి టోకె న్లు ఇచ్చి సుమారు 6 గంటల వరకు ఓటింగ్‌కు అనుమతించారు.
పోలింగ్ బూత్ లేదనే కారణంతో కామారం తండా గిరిజనులు కామారం వచ్చి ఓటేయడానికి నిరాకరించారు. దీంతో నాయకులు, అధికారులు వారిని బుజ్జగించి ఓట్లు వేయించారు.
చిన్నశంకరంపేట పోలింగ్ కేంద్రంలో పరిధిలో ఉన్న మెడికల్ షాపును అధికారులు మూసివేయించడంతో ప్రజలు మందుల కోసం ఇబ్బందులు పడ్డారు.
చందంపేట, సూరారం, ఖాజాపూర్ గ్రామాల్లో 200లకు పైచిలుకు ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు.
నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చిన గిరిజన మహిళ జెమిని బాయి సొమ్మసిల్లి పడిపోగా ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు
పుల్‌కల్: మండలంలో శుక్రవారం జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఓ వృద్ధురాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుల్‌కల్ మండల కేంద్రానికి చెందిన బచ్చమొల్ల నింగమ్మ 101 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆమె కొడుకు బచ్చం మాణిక్యం ఇదే గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున భరిలో ఉన్నారు.
మలి విడతలోనూ భారీ పోలింగ్
Published Fri, Apr 11 2014 11:45 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement