సాక్షి, సంగారెడ్డి: పుర పోరులో ఇరుగుపొరుగు వాళ్లు రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. స్థానికులు కాకపోయినా ఎన్నికల రోజు పిలవని పేరంటానికి అతిథులు’గా పోలింగ్ బూత్‌లకు వస్తున్నట్టు సమాచారం. ఈపాటి ఏర్పాట్లను చాలా మంది అభ్యర్థులు ముందుస్తుగానే చేసి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పరిశ్రమల్లో పనిచేసే స్థానికేతర కార్మికులను రంగంలో దింపేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలు పరిశ్రమల యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.
పోలింగ్ రోజు కార్మికులను తరలించుకుపోయేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లాలో వందల సంఖ్యలో పరిశ్రమలుండడం, పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఉండడంతో కార్మికులకు డిమాండు ఏర్పడింది. ముందస్తు ప్లాన్‌లో భాగంగా కొందరు అభ్యర్థులు బోగస్ చిరునామాలపై వందల సంఖ్యలో బోగస్ ఓట్లను ఓటరు జాబితాలో ఎక్కించారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన ఒక్కో ఇంటి నెంబర్‌పై పదుల సంఖ్యలో ఓటర్లను నమోదు చేశారు. కొందరు అభ్యర్థులు దూరదృష్టితో బంధువులు, స్థానికేతరులు, పరిశ్రమల కార్మికుల పేర్లను సైతం ఓటరు జాబితాలో చొప్పించారు. ఓటరు నమోదు సమయంలో అధికారులు ప్రదర్శించిన అలసత్వం వీరికి కలిసి వచ్చింది.
పోలింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందు ఈ బోగస్ ఓట్లు బయటపడడంతో ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బోగస్ ఓట్లను తొలగించేందుకు ఇప్పటికే సమయం మించి పోవడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడీ బోగస్ ఓట్లే అభ్యర్థుల తలరాతలను మార్చనున్నాయనడంలో అనుమానాలు లేవు. సంగారెడ్డిలోని 28వ వార్డులో ఓ ఇంటి నెంబర్(3-5-48/2)పై ఏకంగా 86 మంది ఓటర్లున్నారనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందడం దీనికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చు.
తటస్తులపై దృష్టి
చివరి నిమిషపు ఏర్పాట్లలో భాగంగా అభ్యర్థులు తటస్త ఓటర్లపై దృష్టి కేంద్రీకరించారు. ఏ అభ్యర్థికి మద్దతిస్తున్నారో స్పష్టంగా బయటపడని తటస్తులను ప్రసన్నం చేసుకోడానికి నానా పాట్లు పడుతున్నారు. గెలుస్తే చేసే పనులపై హామీలు ఇవ్వడమే కాదు.. ఒక్కో ఓటుకు రూ. 1000 నుంచి రూ.1500 వరకు చెల్లించడానికీ వెనుకాడడం లేదు. కొందరు అభ్యర్థులైతే విలువైన కానుకలు సైతం సమర్పించుకుంటున్నారు.
సరిహద్దులు దాటి మద్యం ప్రవాహం..
ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాపై ‘రేషన్’ విధానం అమల్లో ఉన్నా..ఓటర్లకు విచ్చలవిడిగా మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ‘రేషన్’ విధానం భాగంగా గతేడాది మార్చి నెలలో విక్రయించిన కోటాకు అదనంగా 30 శాతం మద్యాన్నే ఆయా మద్యం దుకాణానికి సరఫరా చేస్తారు. ఎన్నికలతో పాటు హోలీ పండగ సైతం ఇదే నెలలో రావడంతో కావాల్సినంత స్టాకు లేక మద్యానికి తీవ్ర కొరత ఏర్పడింది. కొందరు అక్రమార్కులు పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అడ్డదారుల్లో అక్రమ మద్యాన్ని జిల్లాకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
‘పుర’ ప్రచారానికి తెర ప్రలోభాలకు ఎర
Published Fri, Mar 28 2014 11:39 PM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement