సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు పోలీసులు శక్తి వంచన లేకుండా సాయం చేశారు. ఆదివారం ఉదయం 9:30 ప్రాంతంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ వార్డు పోలింగ్‌బూత్‌లో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి భర్త బొంగుల రవి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి టీఆర్‌ఎస్ వారిని బయటకు పంపాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీ ఆర్‌ఎస్ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్‌ను నీఅంతు చూస్తానని పోలింగ్ అధికారి ఎదుటనే బొంగులరవి బెదిరించారు.
విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోగా, బొంగులరవి ఒక్కసారిగా తన అనుచరులతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని నివారించకుండా చోద్యం చూశారు. ఈ దృశ్యాలు కాసేపటికే ‘సాక్షి’ టీవీలో ప్రసారం కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి రమాకాంత్ స్పందించారు. వెంటనే విచారణ జరిపాలని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. స్పందించిన కలెక్టర్ సంఘటనకు బాధ్యులైన ఇరువురినీ వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించడంతో డీఎస్పీ వెంకటేశ్, సీఐ శివశంకర్ వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగిని అరెస్టు
మధ్యాహ్నం 12 గంటలకు ఓటు వేసేందుకు వచ్చిన ఉపాధ్యాయురాలు జ్యోతిని టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తున్నారంటూ సీఐ ఆమెను అరెస్టు చేశారు. ఇదేమని ప్రశ్నించిన ఆమె భర్తను సైతం అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో ఉపాధ్యాయురాలు ఉన్న ప్రాంతంలోనే కాంగ్రెస్ అభ్యర్థి బొంగుల విజయలక్ష్మి ఉన్నప్పటికీ ఆమెను ఏమీ అనని పోలీసులు ఉపాధ్యాయురాలిని అరెస్టు చేయడంతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. 20వ వార్డులో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావల్సి ఉండగా సిబ్బంది ఈవీఎంలను అమర్చడంలో ఆలస్యం కావడంతో అరగంట పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. 21వ వార్డు పోలింగ్‌బూత్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి గోవర్ధన్ నాయక్ విధి నిర్వాహణలో ఉన్న పోలీస్ సిబ్బందిని దూషించడంతో కొద్దిసేపు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పోలింగ్‌ను అడ్డుకున్న నాయకులు
దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పట్టణంలోని 7వ వార్డులో పోలింగ్‌ను అడ్డుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ బోగస్ ఓట్లు వేయిస్తున్నారని బీజేపీ అభ్యర్థి రమేశ్‌తో పాటు టీడీపీ అభ్యర్థి సురేందర్‌లు పోలింగ్‌ను అడ్డుకున్నారు. చనిపోయిన ఓటర్ల పేర్లపైన ఓట్లు వేయిస్తున్నారని పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో 10 నిమిషాల పాటు పోలింగ్‌ను నిలిపివేశారు. అనంతరం పోలింగ్ అధికారి ఓటర్లు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డుతో వస్తేనే అనుమతి ఇస్తామని తెలపడంతో పోలింగ్ ఏజెంట్లు తిరిగి పోలింగ్ ప్రారంభించేందుకు అంగీకరించడంతో 15 నిమిషాల తర్వాత పోలింగ్ పునఃప్రారంభించారు.
ముగిసిన మున్సి‘పోల్స్’
Published Sun, Mar 30 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement
Advertisement