సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: సంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. గడువు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీలు చైర్‌పర్సన్ పదవిని దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. ఎంఐఎం చాపకింద నీరులా సాగిపోతోంది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేపట్టేందుకు జిల్లా స్థాయి నేతలు ఎవరూ రాలేదు. ఆ పార్టీ అభ్యర్థులే సొంతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఉన్న బొంగుల విజయలక్ష్మి పలు వార్డుల్లో ప్రచారాన్ని సాగిస్తున్నారు. టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు వారి బంధువులను ఇండిపెండెంట్లు బరిలో దింపి కాంగ్రెస్‌కు గట్టిపోటీనిస్తున్నారు.
కాంగ్రెస్‌కు దీటుగా ఇతర పార్టీలు..
పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అంత సులభం కాదని తెలుస్తోంది. సదరు పార్టీ అభ్యర్థులు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు సైతం ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తూ కాంగ్రెస్‌కు సవాల్ విసురుతున్నారు. పలు వార్డుల్లో కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ నాయకులు కొందరు ఇతర పార్టీల తరఫున పోటీ చేస్తుంటే మరికొందరు ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచారు. ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నగేశ్‌కు స్వతంత్ర అభ్యర్థి గులాంఖాదర్, రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జ్ఞానేశ్వరికి కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ ఎంఐఎం అభ్యర్థి అన్నపూర్ణ గట్టిపోటీనిస్తున్నారు. 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌కు ఎంఐఎం అభ్యర్థి అజీజ్, బీజేపీ అభ్యర్థి నాగరాజుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయకు టీఆర్‌ఎస్ అభ్యర్థి మందుల శివలక్ష్మి గట్టిపోటీనిస్తున్నారు.
5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శివశంకర్‌కు టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్ పోటీనివ్వగా ఎంఐఎం అభ్యర్థి రజియొద్దీన్ కాంగ్రెస్ ఓట్లను చీల్చే అవకాశముంది. 24వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మహబుబ్‌ఉన్నీసాకు మాజీ మార్కెట్ కమిటీ డెరైక్టర్ వెంకట్‌రాజు తల్లి సావిత్రి నువ్వా.. నేనా అన్న రీతిలో పోటీ ఇవ్వనున్నారు. వీటితోపాటు ఎంఐఎం పోటీ చేస్తున్న 18 వార్డుల్లో పోటీ రసవత్తరంగా మారనుంది.
మైనార్టీ ఓట్లే కీలకం...
సంగారెడ్డి పట్టణంలో మైనార్టీ ఓట్లు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో వారు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే వారు ఎటు వైపు ఉన్నారో ఇంకా వెల్లడి కాలేదు. పట్టణంలో 28 శాత ం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. దీంతో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తొమ్మిది స్థానాల్లో తొలిసారిగా పోటీ చేస్తున్నారు. సదరు అభ్యర్థులు 12వ, 13, 16, 18వ వార్డుల్లో ఎంఐఎంకు గట్టిపోటీ ఇవ్వనున్నారు. వీరికితోడు 16 మంది స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థులకు దీటుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.
సంగారెడ్డి పురపోరు రసవత్తరం
Published Thu, Mar 27 2014 12:33 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement