సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: అరవై ఏళ్ల స్వప్నం ఫలించింది. ఆత్మ బలిదానాల కోరిక పరిపూర్ణమైంది. అయినా అదే రాగం మళ్లీ పునరావృతమవుతోంది. ఉద్యమం అంటే తెలియని పెద్ద దొరలు డబ్బు మూటలు పట్టుకొని వచ్చి టికెట్లు ఎగిరేసుకుపోతుంటే..! మా పాలన మాకేనని తెలంగాణ ఉద్యమంలో మండిన గోళాలు ఇప్పుడు గోస పడుతున్నాయి. కరివేపాకు మయ్యామా అని కన్నీళ్లు పెడుతున్నాయి. ఈ తంతు ఇది ఏ రాజకీయ పార్టీలోనో కాదు. త్యాగాలతో పురుడు పోసుకుని.. ఆత్మ బలిదానాల మీద ఎదిగిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో నెలకొంది. రాజకీయ రంగు పులుముకున్న తరువాత కొనసాగుతున్న తీరు ఇది. ఉద్యమకారులను కరివేపాకుల్లా చేసి డబ్బున్న దొరలకే రాచబాటలు వేస్తోందన్న విమర్శలు మూటగట్టుకుంటోంది. అందుకు మెతుకుసీమే వేదికైంది. నాణేనికి ఒక వైపు.. టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగోళ సత్యనారాయణ, మరో వైపు బడా పారిశ్రామికవేత్త బీబీ పాటిల్ గురించే జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
జర్నలిస్టుగా ఎదిగి... తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఆస్తులను, ఆప్తులను పొగొట్టుకున్న సత్యనారాయణ ఇప్పుడు ఒంటరి వాడయ్యాడు. జిల్లాలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు ఎవరంటే సత్యనారాయణ పేరు చెప్పేవారు. ఉద్యమ నిర్మాణంలోనే ఆయన సగం జీవితం కరిగిపోయింది. గంటలు.. రోజులు.. నెలల తరబడి పార్టీ కోసం పని చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షునిగా క్యాడర్ నిర్మాణం చేశారు. తీరా టికెట్ల పంపకాలు వచ్చే వరకు సత్యనారాయణ కరివేపాకు అయిపోయారు. చింతా ప్రభాకర్‌కు
సంగారెడ్డి నుంచి టీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇవ్వటం స్వాగతించే అంశమే అయినా అదే టికెట్ కోసం పోటీ పడిన సత్యనారాయణ పట్ల ఆ పార్టీ వ్యవరిస్తున్న తీరు మీద విమర్శలు వస్తున్నాయి.
‘ఆస్తులను, ఆప్తులను పొగొట్టుకొని పార్టీ కోసం పని చేశాను. నా మేథస్సునంతా ఉద్యమ నిర్మాణానికే దారపోశాను. ఇప్పుడు ఒంటరిని చేశారు. టికెట్ ఇవ్వమని అడిగితే ఎంత డబ్బు ఇవ్వగలవని అడిగారు.. డబ్బు లేదంటే పార్టీకి పనికి రావని మొఖం మీదే చెప్పారు. ఎదురు తిరగలేను, ఆత్మాభిమానం చంపుకోలేను, ఒక అస్థిపంజరాన్ని అయిపోయాను. కేసీఆర్ గురించి నాకు బాగా తెలుసు.. ఓ కుక్కను చంపాలనుకుంటే ముందుగా దానిని పిచ్చి కుక్కగా చిత్రీకరిస్తారు, అందుకు నేను కూడా ఏమీ మినహాయింపు కాదు’అని సత్యనారాయణ తన మిత్రుల వద్ద గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
ఇక బీబీ పాటిల్ విషయానికి వస్తే.. నిజంగా ఈ పేరు అటు నిజామాబాద్ జిల్లా ప్రజలు, ఇటు మెదక్ జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా వినని పేరు. పూర్తి పేరు భీంరావు బసంత్‌రావు పాటిల్. నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని సిరిపూర్ గ్రామం. ఎప్పుడో రాష్ట్రం విడిచిపెట్టిపోయి మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డారు. పెద్ద వ్యాపార వేత్త. రూ. వందల కోట్లకు అధిపతి. అక్కడ ప్రభుత్వ, ప్రైవేటుసంస్థలకు సంబంధించి పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులను నిర్వహిస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. పూణెలో ఇంటర్‌నెట్ కేంద్రాలను సైతం నిర్వహిస్తున్నట్లు, ఆయా కేంద్రాలలో సుమారు 2వేల మందికి పైగా పని చేస్తున్నట్లు సమాచారం.
మహారాష్ట్రలో రాజకీయల్లో చక్రం తిప్పగల సమర్థుడు. నిజం చెప్పాలంటే ఆయనకు తెలంగాణ ఉద్యమానికి ఏ సంబంధం లేదు. కానీ జహీరాబాద్ ఎంపీ సీటు ఖాళీగా ఉందని తెలియడంతో తన బంధవుల ద్వారా గులాబీ దళపతికి వర్తమానం పంపారు. నెల రోజుల కిందట జహీరాబాద్ వచ్చి ఓ మెడికల్ క్యాంపు పెట్టారు. టీఆర్‌ఎస్ పార్టీ పెద్దలతో మాట ముచ్చట అయిపోయింది. ముహూర్తం కుదిరింది. వచ్చే నెల ఒకటో తారీఖున ఆయన టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుని జహీరాబాద్ నుంచి పోటీకి నిలబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ పార్టీలో జరుగుతున్న ఈ తంతును చూసి కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు.
డబ్బు మూటలకే టికెట్లు!
Published Fri, Mar 28 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM
Advertisement
Advertisement