సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: 60 ఏళ్ల కల సిద్ధించింది. అమరుల త్యాగాలు ఫలించాయి. ఆత్మగౌరవ పోరాటం సంపూర్ణమైంది. మన పాలన ముంగిట్లో మనం ఉన్న వేళ పడుతున్న తప్పటడుగులు మెతుకుసీమ ప్రజలను కలవరపరుస్తోంది. తెలంగాణ భాష, యాస మీద విధ్వంసం జరుగుతోందని బాధపడ్డ కేసీఆర్ అసలు తెలుగు భాషే రాని, తెలంగాణ యాస తెలియని మరాఠీ వ్యాపారిని పట్టుకొచ్చి పార్లమెంటు టికెట్ ఇవ్వడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఉద్యమం ఎగసిన వేళ ముందుండి నడిచిన యువకులు కొందరైతే.. ఆర్థికంగా ఉద్యమానికి అండగా నిలిచినవాళ్లు మరి కొందరు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ర్టంలో మన పాలన అనుకున్న వీళ్లందరినీ పక్కనపెట్టి జహీరాబాద్ పార్లమెంటు నుంచి బీబీ పాటిల్‌కు టీఆర్‌ఎస్ అవకాశం ఇవ్వడం నిజామాబాద్, మెదక్ జిల్లాల తెలంగాణవాదులను విస్మయానికి గురిచేసింది. కర్ణాటక సరిహద్దు గ్రామంలో పుట్టిన ఆయన ఎప్పడో మహారాష్ట్రలో స్థిరపడ్డారు. పాటిల్ మాతృ భాష కన్నడం. విద్యాభ్యాసం కర్ణాటక రాష్ట్రం డగ్లూరు నుంచి మొదలైంది. బీబీ పాటిల్‌కు తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదు, ఉద్యమ స్వరూపం, నేపధ్యం ఏమిటో తెలియదు. అమర వీరుల బలిదానాలు, ప్రజలు త్యాగాల ఫలితంగా రాష్ట్రం సాధించుకున్న తరువాత ఆయన ఇక్కడికి దిగుమతి అయ్యారు. జహీరాబాద్ పీఠం మీద కన్నేశారు.
ఇటీవల జోగిపేటలో జరిగిన తెలంగాణ విజయోత్సవ సభలో‘జె తెలంగాణ’ అనే రణ నినాదాన్ని పలకడానికి అష్ట కష్టాలు పడ్డారు. అలాంటి వ్యక్తి నాయకునిగా నిలబెట్టడంపై అటు నిజామాబాద్, ఇటు మెదక్ ప్రజలు ఆందోళనతో ఉన్నారు. వ్యాపారం చేసి సంపాదించిన రూ. వేల కోట్ల డబ్బు బలంతోనే కేసీఆర్‌ను మెప్పించారనే విమర్శలూ వస్తున్నాయి. మా భాష తెలియని నాయకుణ్ణి తెచ్చి నిలబెట్టారు.. మా మనోభావాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా మాటే రాని(భాష రాని) మనిషిని తీసుకొచ్చి మాకు మోపు చేయడం కంటే కేసీఆర్ సారొచ్చి జహీరాబాద్ నుంచి పోటీ చేసినా మేం జోలెపట్టి ఓట్లడిగి గెలిపించుకునేటోళ్లం’ అని నారాయణఖేడ్‌కు చెందిన మిహ ళా గ్రూపు సభ్యురాలు అనీశ ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్ నుంచి కేసీఆర్...
మెదక్ పార్లమెంటు నుంచి కేసీఆర్, జహీరాబాద్ పార్లమెంటు నుంచి బీబీ పాటిల్ పేర్లను టీఆర్‌ఎస్ ఖరారు చేసింది.ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం వారి పేర్లను ప్రకటించింది. బీబీ పాటిల్ సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీకి, మెదక్ పార్లమెంటుకు నామినేషన్లు వేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నంగనూరు మండలం కోనాయిపల్లికి చేరుకుంటారు. అక్కడ శ్రీవెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 10.30 గంటలకు సంగారెడ్డికి చేరుకుని మెదక్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత 12.20 గంటలకు గజ్వేల్ చేరుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పిస్తారు, అక్కడి నుంచి నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి.
కేసీఆర్ అన్నా.. ఇదేం కిరికిరి
Published Tue, Apr 8 2014 11:38 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement