ముగిసిన పరిషత్ పోరు | local body elections ended | Sakshi
Sakshi News home page

ముగిసిన పరిషత్ పోరు

Published Sat, Apr 12 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

local body elections  ended

సాక్షి, ఖమ్మం: జిల్లాలో పరిషత్ పోరు ముగిసింది. తొలి విడతలో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకోగా...శుక్రవారం నాడు ఖమ్మం డివిజన్‌లో మలివిడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థుల గుర్తులు తారుమారు, పోల్ స్లిప్పులు లేకపోవడం, సమస్యలు పరిష్కరించలేదని ఓటింగ్‌కు దూరం, ఓటర్లను ప్రలోభ పరిచే చర్యలకు  పోలీసుల బ్రేకులు... ఇలా మలివిడతలో కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి.

 మొత్తం రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు సజావుగా జరగడంలో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకే  ఖమ్మంరూరల్, నేలకొండపల్లి, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు తరలివచ్చారు. బ్యాలెట్ పత్రం కావడంతో ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరిగింది.  మండుటెండలోనూ ఓటర్లు క్యూలోనిల్చొని ఓటు వేశారు. ఉష్ణతాపం తాళలేక పోలింగ్ కేంద్రాల్లో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకే అన్ని కేంద్రాలలో ఎక్కువ  శాతం పోలింగ్ నమోదైంది.    

  తల్లాడ మండలం కలకొడిమ ఎంపీటీసీ బ్యాలెట్‌పత్రాల స్థానంలో వెంగన్నపేట ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలు రావటంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. అప్పటికే 11 మంది వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12వ వ్యక్తి ఓటు వేయడానికి వెళ్లి బ్యాలెట్ పత్రాన్ని గమనించడంతో పోలింగ్‌ను నిలిపివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి పోలింగ్ ప్రారంభమైంది.

     పెనుబల్లి మండలం లంకపల్లి ఎస్సీ కాలనీలో బైండోవర్ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ 20 కుటుంబాల ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించగా... సత్తుపల్లి డీఎస్పీ అశోక్‌కుమార్ వారికి సర్దిచెప్పటంతో చివరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  సత్తుపల్లి మండలం కిష్టారంలో నలుగురు, తుంబూరులో ఒకరు క్యూలో గంటల తరబడి నిల్చొని సొమ్మసిల్లి పడిపోవటంతో పీ హెచ్‌సీ సిబ్బంది వైద్య సహాయం అందించారు.

  రఘునాథపాలెం మండలంలోని రాంక్యాతండా పంచాయతీ పరిధిలో ఉన్న తండాలన్నింటికీ కలిపి రాంక్యాతండా పాఠశాలలోనే నాలుగు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఒకేసారి ఓటర్లు అంతా పాఠశాలకు చేరుకోవడంతో ఆవరణ మొత్తం ఓటర్లతో నిండిపోయింది. దీంతో  ఉదయం 8 గంటలకే భారీగా క్యూ కట్టారు. ఎండవేడిమికి తాళలేక ఇబ్బంది పడ్డారు. తండాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పినా అధికారులు వినలేదని ఓటర్లు అగ్రహం వ్యక్తంచేశారు. క్యూ విషయంలో అక్కడ ఓటర్లు, పోలీసులకు మధ్య ఘర్షణ జరగడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచుకొండ పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు రాత్రి డబ్బులు పంచారంటూ పోలింగ్‌కేంద్రం సమీపంలో ఘర్షణపడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పోలింగ్‌కేంద్రానికి దూరంగా పంపించారు.

  వైరా మండలం గొల్లపుడి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ఏజెంట్‌పై టీడీపీ నాయకుడు దాడి చేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. పోల్ స్లిప్పులు లేకపోవడంతో వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‌లలో అర్దగంట సేపు పోలింగ్ నిలిచిపోయింది.

  కొణిజర్ల మండలం కొండవనమాల, కాచారం గ్రామాల్లో పోలింగ్  సుమారు గంట సేపు నిలిచి పోయింది. రెండు గ్రామాల్లో ఓటర్ల జాబితా తారుమారు కావడంతో ఓటర్లు తికమక పడ్డారు. కొండవనమాల ఓటర్లు కాచారానికి, కాచారం ఓటర్లు కొండవనమాలకు జాబితా మారింది. అధికారులు గుర్తించి సరిచేసే సరికి గంట సేపు పోలింగ్ నిలిచిపోయింది.

  ఎర్రుపాలెం మండలం గట్టగౌరారం, సత్యనారాయణపురం గ్రామాల్లో ఓటర్ల జాబితా తారుమారు కావడంతో అర్దగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది.

  బోనకల్ మండలం కలకోటలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పైడిపల్లి మురళి పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో ఆయనను అరెస్టు చేశారు. లక్ష్మీపురం గ్రామంలో ఏఎంసీ వైఎస్ చైర్మన్ మైనేని నారాయణ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడంతో  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ఓటర్లకు సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నేతలు అల్పాహారం పెడుతున్నారని అక్కడ ఉన్న ఆటోను సీజ్ చేశారు. కాకరవాయిలో ఎక్కువ మంది ఓటర్లు ఉండడంతో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరిగింది.

 ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెంలో తమ సమస్యలను పరిష్కరించలేదని బీసీ కాలనీకి చెందిన 20 మంది ఓటర్లు ఓటును బహిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement